హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని పేర్కొంటూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం కోదండరాం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం, ఏపీలో పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ముంపు ప్రాంతాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్కుమర్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. గోదావరి వరద ముంపు నివారణకు తీసుకున్న చర్యలు నివేదించాలని కేంద్రంతోపాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది కే శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఆ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలోని మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి తదితర జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో పలు ప్రాంతాలు ముంపునకు గురౌతాయని చెప్పారు. తెహ్రీ డ్యాం, సర్దార్ సరోవర్ ప్రాజెక్టుల వల్ల ఎదురైన సమస్యల పరిషారానికి ఏర్పాటుచేసిన అథారిటీ తరహాలో ఇకడ కూడా ఏర్పాటుచేయాలని కోరారు. మంచిర్యాల, భద్రాచలం పట్టణాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచలో రక్షణ గోడలు నిర్మించేలా ఉత్తర్వులు ఇవ్వాలని అన్నారు. కుమ్రంభీం, ములుగు జిల్లాల్లో పంట ముంపునకు గురవుతున్నదని, పంటల నష్టానికి పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వరదల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాల నివారణపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం, కేంద్ర హోం, పర్యావరణ, జలశక్తి శాఖలతోపాటు జాతీయ విపత్తుల మండలి, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్, కమిషనర్లను నియమించేందుకు ప్రభుత్వం జూలై 3న నోటిఫికేషన్ జారీచేసిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రధాన కమిషనర్ పోస్టుకు 40 దరఖాస్తులు, కమిషనర్ పోస్టులకు 273 ధరఖాస్తులు వచ్చాయని తెలిపింది. త్వరలోనే సెలక్షన్ కమిటీని ఏర్పాటుచేసి నియామక చర్యలు చేపడతామని పేర్కొంది. కమిటీ ఏర్పాటుకు గడువు కావాలని కోరడంతో ఈ అంశంపై దాఖలైన ప్రజాహిత వ్యా జ్యంపై విచారణ 4 వారాలకు వాయిదా పడింది.