నిన్నమొన్నటి దాకా మహిళలవైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిన నగరం.. ఇప్పుడు ఆకతాయిల వేధింపులతో నిత్యం వార్తల్లో నానుతున్నది. షీ-టీముల నిఘా, పటిష్ట భద్రతావ్యవస్థతో మహిళల రక్షణకు కొత్త అర్థం చెప్పిన హైదరాబాద్.. ఇప్పుడు అభద్రతతో తల్లడిల్లుతున్నది. కుటుంబంతో కలిసి బయటకు వచ్చిన ఓ మహిళను ఆకతాయిలు వేధించారు. ఇంటివరకు వెంబడించారు. అడ్డొచ్చిన భర్తపై బీరుబాటిళ్లతో దాడి చేశారు. పోలీసులు వస్తారేమోనన్న జంకు లేదు. కుటుంబ సభ్యులున్నారన్న వెరపు లేదు. అంతా తమ రాజ్యం అన్నట్టే చెలరేగిపోయారు. చివరికి కుటుం బం ఫిర్యాదుతో ముగ్గురిని మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఆకతాయి మూకకు అంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? కామాంధులు బరితెగించేదాకా మన భద్రతావ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఏడాదిన్నరలో శాంతిభద్రతలు ఎందుకింతలా చట్టుబండలయ్యాయి? హత్యలు, అఘాయిత్యాలతో విశ్వనగరానికి రక్తపుమరకలెందుకు అంటుతున్నయ్? భాగ్యనగరి ఇలా అభద్రనగరిగా మారిపోయిందేమి?
Hyderabad | వెంగళరావునగర్, మే 2: హైదరాబాద్‌లో కామాంధులు బరితెగించారు. భర్త ఎదుటే భార్యను వేధించారు. ‘నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నంబర్ ఇవ్వు’ అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో బెదిరించారు. భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి పబ్‌కు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా యువతిని వెంబడించారు. దౌర్జన్యానికి దిగి ఫోన్లతోపాటు బైక్‌ను లాక్కొని దాడికి పాల్పడ్డారు. బాధిత కుటుంబం డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో ముగ్గురు కామాంధులను కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన ఒక యువతి (29) తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి రహ్మత్‌నగర్‌లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం సాయంత్రం ఆ యువతి తన భర్త, మరిది, ఆడపడుచు, తమ బంధువుల స్నేహితుడితో కలిసి బేగంపేటలోని క్లబ్-8 అనే పబ్‌కు వెళ్లారు. అనంతరం రాత్రి 11.40 గంటల సమయంలో పబ్ నుంచి బయటకు వస్తుండగా కామాంధులు అడ్డగించారు. తాను భర్తతో కలిసి వచ్చానని యువతి చెప్పగా.. ‘నన్నే నీ భర్త అనుకో.. ఫోన్ నంబర్ ఇవ్వు’ అంటూ వేధించారు. బీరు బాటిళ్లు చేతబట్టుకొని బెదిరించారు. బేగంపేట నుంచి రహ్మత్‌నగర్‌లోని ఇంటికొచ్చే వరకూ దారిపొడవు నా ఆ కామాంధులు వెకిలిచేష్టలతో వెంబడిస్తూ వేధించారు. అనంతరం యువతిని ఇంట్లో దిగబెట్టిన ఆమె భర్త.. తన స్నేహితుడ్ని డ్రాప్ చేయడానికి మాదాపూర్ వెళ్తుండగా.. ఆ ముగ్గురు వ్యక్తులు ఎస్ఆర్నగర్ మెట్రోస్టేషన్ వద్ద అడ్డగించి దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణించే బైక్‌తోపాటు ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. డీ సంపత్ (28), సందీప్ (28), ఉమేశ్ (28)లను అరెస్టు చేశారు.
కట్టుకున్నోడే కడతేర్చాడు! ; పిల్లల్లేరని, ఆస్తి తగాదాలతో నిత్యం వేధింపులు
కొడిమ్యాల, మే 2 : తమకు సంతానం లేకపోవడంపై కుటుంబ సభ్యుల నుంచి సూటిపోటి మాటలు, దానికితోడు అన్నదమ్ములతో ఆస్తి తగాదాలు.. అన్నింటికీ భార్యే కారణమని భావించిన భర్త ఆమెను కడతేర్చాడు. ఇంట్లోనే ఉరివేసి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. వారం తర్వాత తాళం పగులగొట్టిన పోలీసులకు ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించి సీఐ నీలం రవి, ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కొడిమ్యాలకు చెందిర అవుదుర్తి మహేందర్‌కు, గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మమత(35)తో 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఉపాధి కోసం మమత, మహేందర్ కరీంనగర్లో అద్దెకు ఉంటున్నారు. గత సంవత్సరం కాలంగా అత్త, మామలు వజ్రవ్వ, లక్ష్మణ్, మరుదులు అనిల్, వెంకటేశ్‌లతో మమతకు వేధింపులు ఎక్కువయ్యాయి. మహేందర్ కూడా వారికి వంతపాడటం ప్రారంభించాడు.
ఆస్తి తగాదాతోపాటు సంతానం లేదంటూ మానసికంగా వేధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మహేందర్ తన భార్యను చంపాలని నిర్ణయించుకుని, గత నెల 26న ఆమెను కొడిమ్యాలలోని తమ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో తాడుతో మెడకు ఉరి వేసి హత్య చేశాడు. సాయంత్రం మమత కనపడడం లేదంటూ వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో గత నెల 28న కరీంనగర్‌లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మమత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మహేందర్‌ను, అతని తల్లిదండ్రులను మమత గురించి నిలదీయగా దాటవేసే ప్రయత్నం చేశారు. అనుమానంతో శుక్రవారం కొడిమ్యాలలోని ఇంటి తాళాలు పగులగొట్టి చూడగా మమత మృతదేహం ఉన్నది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రఘుచందర్, సీఐ, ఎస్ఐ పరిశీలించి మృతదేహన్ని జగిత్యాల దవాఖానకు తరలించారు. మమత తల్లి రాచకొండ పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేందర్‌తోపాటు వారి తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు.