LRS | హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఖాళీ ఖజానాను నింపుకోవడానికి లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ, అనధికారికంగా ఉన్న ప్లాట్లను రెగ్యులర్ చేయడం కోసం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిని పెంచింది. మార్చి నాటికి (అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకు) ఎల్ఆర్ఎస్ పరిష్కారం పేరుతో దాదాపు రూ.10 వేల కోట్లు వసూలు చేయాలని సర్కారు భావించింది. 25 శాతం రాయితీతో, వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద మొత్తం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడం కోసం కొత్త ఎత్తు వేసింది.
ఇందుకు సంబంధించిన జీవో ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఈ జీవోను వెనువెంటనే అమల్లోకి తీసుకురాడానికి అధికారులు సిద్ధంగా ఉన్నా రు. రెగ్యులరైజేషన్ కోసం దాదాపు 25 లక్షల వరకు దరఖాస్తులు రాగా, వాటిలో ఇప్పటివరకు కనీసం 3 లక్షల దరఖాస్తులకు కూడా పరిష్కారం లభించలేదు. ఈ దశలో నిధుల కోసం సర్కారు ఒక మెట్టు దిగింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు రాయితీ ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్కు ఉచితంగా చేస్తామని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాటమార్చి ఎల్ఆర్ఎస్ కోసం ఫీజులు వసూలు చేస్తున్నది. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.