Lovers Suicide attempt | స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 07 : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాడికొండ గ్రామంలో ప్రేమజంట సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, మండలంలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
తాటికొండ గ్రామానికి చెందిన మారపాక అంజయ్య, రేణుకులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు మానసిక వికలాంగుడు. పెద్ద కుమారుడు అన్వేష్(26), కూతురు పెళ్లి చేశారు. నిరుపేద చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఈ కుటుంబం కూళి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. కాగా హనుమకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన గడ్డం దాసు, ఎలిషా దంపతులకు ఒక కుమారుడు కాగా, కూతురు లేకపోవడంతో పావని అనే అమ్మాయిని చిన్నప్పటినుండే సాదుకున్నారు. పావని తండ్రి దాసు సంవత్సరం క్రితం మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అన్వేష్ కు, పావని కి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఇరువురు పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుని అమ్మాయిని గత మూడు నెలల క్రితమే అబ్బాయి తన ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటినుండి అందరూ అదే ఇంటిలో కలిసి ఉంటున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు సైతం నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో పెళ్లి ఖర్చులు భరించి పెళ్లి చేయడానికి ఇరువురి కుటుంబాలు గత రెండు నెలల రోజుల క్రితమే అంగీకరించాయి. ఈలోగా అబ్బాయి అక్క కొడుకు మృతి చెందడంతో వీరికి చుట్టు రావడం, తర్వాత వినాయక చవితి పండుగ రావడం అటు తరువాత అబ్బాయి బంధువులు చనిపోవడం మళ్ళీ చుట్టు రావడంతో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.
ఇలా వీరి పెళ్లికి ఏదో ఒకటి అడ్డంకి రావడంతో ఈ ప్రేమ జంట అన్వేష్, పావనీల మధ్య గత వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం వారి పాత ఇంటిలో ఎవరు లేని సమయంలో గడ్డి మంది తాగి ప్రేమ జంట ఆత్మహత్యానికి పాల్పడ్డారు. వీరిని చూసిన అబ్బాయి తల్లి బంధువులకు, ఇరు పక్కల వారికి తెలుపగా, వారిని చికిత్స నిమిత్తం వరంగల్ యంజీయం తరలించారు. కాగా మంగళవారం ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో అన్వేష్ మృతిచెందగా, పావని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.