తెలంగాణ లారీ యజమానులు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లారీ యాజమాన్యాల సంఘాల అసోసియేషన్ల అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి, బి. నందారెడ్డి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా శాఖ కమిషనర్ శ్రీనివాస రాజుతో సమావేశమయ్యారు.
ఈ క్రమంలో లారీ యజమానుల సమస్యలు విన్న అధికారులు తెలుగు రాష్ట్రాలలో సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేసేందుకు సానుకూలంగా స్పందించారు. పాత లారీలకు గ్రీన్ టాక్స్ తగ్గింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. లారీలు ఓవర్ లోడ్‌తో నడిపే డ్రైవర్ల లైసెన్స్ సస్పెన్షన్‌ను పూర్తిగా రద్దు చేయాలని లారీ యజమానులు చేసిన విజ్ఞప్తికి సీఎస్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
అలాగే గ్రామ పంచాయతీ, మున్సిపల్ పరిధిలో లారీల రవాణా రుసుమును వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని లారీ యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. లారీ యజమానుల సమస్యల పరిస్కారం విషయమై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, డా. వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా కమిషనర్ శ్రీనివాస రాజుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
లారీ యజమానుల రాష్ట్ర అసోసియేషన్లు మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటున్నట్లు మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్‌కు తెలియజేశారు. కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని బలపరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వాళ్లు చెప్పారు.
ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. నందారెడ్డి, ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి, చాంద్ పాషా, సలీం, లింగ స్వామి గౌడ్, రాధాకృష్ణ, రాంరెడ్డి, బాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, లింగన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.