హైదరాబాద్, మే16 (నమస్తే తెలంగాణ) : ఒకటి రెండేండ్లు కాదు.. సంవత్సరాలుగా ఒకే చోట తిష్టవేశారు. నిత్యం సాకులు చూపుతూ బదిలీలను తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా, అధికారాన్ని ఉపయోగించుకుని లాంగ్ స్టాండింగ్ అధికారుల కొమ్ముకాస్తున్నారని ఉద్యోగవర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని ఆయా శాఖల్లోని ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు.
ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో మల్టీజోనల్ ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ), ఎస్‌డబ్ల్యూవో (అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్), జోనల్ పోస్టుల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు సూపరింటెండెంట్లు తదితర క్యాడర్లలో పలువురు ఆఫీసర్లు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ ఉద్యోగి దాదాపు 19ఏండ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన నాటి నుంచి ఒకే కార్యాలయంలో విధులను నిర్వర్తిస్తూ ప్రమోషన్లను పొందుతున్నారు. సదరు ఉద్యోగి తాజాగా బదిలీ జాబితాలోనూ ఉన్నప్పటికీ ఆ ఉద్యోగి మళ్లీ యథావిధిగా ప్రస్తుత కార్యాలయంలోనే కొనసాగేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. సుదీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏఎస్‌డబ్ల్యూవో కూడా సెన్సస్ డ్యూటీ పేరిట బదిలీ నుంచి మినహాయింపు పొందుతుండడం గమనార్హం. గురుకుల సొసైటీలోనూ పలువురు టీచర్లు మినహాయింపులు పొందేందుకు యత్నిస్తున్నారు.
బీసీ సంక్షేమశాఖలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఈ శాఖకు సంబంధించి ఓ డీడీ ఐదేండ్లుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. మళ్లీ ఇక్కడే యథావిధిగా కొనసాగేందుకు పావులు కదుపుతున్నారు. డీఎస్ఎస్ భవన్లో పలువురు ఉద్యోగులు ఏండ్ల తరబడి తిష్ట వేశారు. జూనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు మొదలు ఉన్నతాధికారుల వరకు అందరిదీ ఇదే పరిస్థితి. ఒకే బిల్డింగ్‌లో 6వ ఫ్లోర్(బీసీ సంక్షేమశాఖ) నుంచి 2 ఫ్లోర్ (గురుకుల సొసైటీ)కు అటూ ఇటూ మారడం తప్ప ఇతర చోట్లకు బదిలీపై వెళ్లింది లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సూపరింటెండెంట్ అధికారి ఏకంగా 13 ఏండ్లుగా ప్రధాన కార్యాలయంలోనే పాగా వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ప్రధాన విభాగాల్లో, కార్యాలయాల్లో పాగా వేసిన కొందరు అధికారులు ఉన్నతాధికారులకు బినామీలుగా వ్యవహరిస్తున్నారని సంక్షేమశాఖ అధికారుల్లో చర్చ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సైతం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు తాజా బదిలీల్లోనూ ఎక్కడికి వెళ్లకుండా కాపాడుతున్నారని తెలుస్తున్నది. సెన్సస్ డ్యూటీ, వికలాంగులకు, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్, ఉద్యోగ సంఘాలు తదితర వాటిపై ప్రభుత్వం కల్పించిన మినహాయింపులనే సాకుగా చూపుతూ ఉన్నతాధికారులు చక్రం తిప్పుతున్నారని సంక్షేమశాఖ ఉద్యోగవర్గాలు విమర్శిస్తున్నాయి. అంతేకాదు అమాత్యులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ల పేరు చెప్పి పలువురు ఉన్నతాధికారులే ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారని సంక్షేమశాఖ ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని, ఏండ్ల తరబడి పాగావేసిన వారి బదిలీలపై దృష్టిసారించాలని డిమాండ్ చేస్తున్నారు.