హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియో వాస్క్యులర్- థొరాసిక్ సర్జన్స్ (ఐఏసీటీఎస్) 54వ అధ్యక్షుడిగా హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జ ఎన్నికయ్యారు. ఈ నెల 16 నుంచి 19 వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఐఏసీటీఎస్ అధ్యక్షుడిగా తెలుగు రాష్ర్టాల నుంచి ఎన్నికైన వారిలో సజ్జ నాలుగో వ్యక్తి. ప్రస్తుతం ఈయన స్టార్ హాస్పిటల్స్‌లో సీనియర్ కార్డియాక్ సర్జన్‌గా, సజ్జా హార్ట్ ఫౌండేషన్ చైర్మన్‌గా, సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కార్డియో-థొరాసిక్ సర్జరీ రంగాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు, కొత్త కార్యక్రమాలను చేపట్టేందుకు అసోసియేషన్‌కు నిరంతరం సేవలందిస్తానని ఈ సందర్భంగా డాక్టర్ లోకేశ్వరరావు సజ్జ భరోసా ఇచ్చారు.