Local Body Elections | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సంవత్సరంగా కాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించాలని యోచిస్తున్నట్టు వినికిడి. ఈ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రుల సమావేశంలో పంచాయతీ ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో పెండింగ్‌లో ఉన్నందున పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో దాదాపు ఏడాది క్రితమే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల్లో పాలనా వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రభుత్వం యోస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎన్నికల షెడ్యూల్, ఓటరు జాబితా తయారీ, నామినేషన్ల ప్రక్రియ లాంటి అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో వివరణాత్మక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు 12,777
రాష్ట్రంలోని 12,848 గ్రామ పంచాయతీలకు 2019లో ఎన్నికలు జరిగాయి. వాటిలో 71 గ్రామాలు ఫ్యూచర్ సిటీలో విలీనమైనందున మిగిలిన 12,777 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో మహిళలకు 50% రిజర్వేషన్ అమలైనందున ఈసారి కూడా వారికి సగం సీట్లు దక్కనున్నాయి. గతంలో 2.02 కోట్ల జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలుచేశారు. ఇప్పుడు కొన్ని గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనమైనందున గ్రామీణ జనాభా 1.90 కోట్లకు చేరింది. దీని ప్రకారం ఈసారి బీసీలకు 20-22%, ఎస్సీలకు 18-20%, ఎస్టీలకు 8-10% సీట్లు కేటాయించే అవకాశం ఉన్నది. రొటేషన్ అమలుకు ప్రభుత్వం చట్టం చేసినందున గతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ స్థానాలు ఇప్పుడు మారుతాయి. ఎస్సీ సీటు బీసీ లేదా జనరల్‌కు కేటాయించే అవకాశం ఉంటుంది.
నిలిచిపోయిన గ్రాంట్లు
రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలతోపాటు 539 మండల ప్రజా పరిషత్ పాలకవర్గాల గడువు నిరుడు ఫిబ్రవరి 1తో ముగిసింది. 28 జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు 2024 జూలై 5వ తేదీతో ముగియగా.. ము లుగు, ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్ జెడ్పీలతోపాటు ఆ 4 జిల్లాల్లోని మండల పరిషత్ పాలకవర్గాల గడువు 2024 ఆగస్టు 5తో ముగిసింది.
గ్రామాలు నిర్వీర్యం
రాష్ట్రంలో గ్రామీణ పరిపాలనా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో గ్రామాలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రజారోగ్య, పారిశుద్ధ్య, తాగునీటి వ్యవస్థలు కుంటుపడిపోయాయి. కనీసం నీళ్ల ట్యాంకులను కూడా శుద్ధిచేసే పరిస్థితి లేదు.
– గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి,తెలంగాణ సర్పంచ్ల సంఘంరాష్ట్ర అధ్యక్షుడు