వేములవాడ, జూలై 4: కాంగ్రెస్ పాలనలో పెద్దఎత్తున అక్రమాలు, పోస్టుల కోసం పైరవీలు జరుగుతున్నాయి. వేములవాడ రాజన్న ఆలయంలో ఔట్సోర్సింగ్ పోస్టులకోసం మంత్రుల మధ్య నెలకొన్న పోటీయే దీనికి నిదర్శనం. ఉమ్మడి జిల్లా మంత్రులతోపాటు ఇతర జిల్లాల మంత్రులు కూడా ఉద్యోగాల కోసం 11మందిని నియమించుకోవాలని ప్రతిపాదనలు పంపారు. ఒకే కుటుంబంలో నలుగురికి, మరో కుటుంబానికి చెందిన భార్యాభర్తలను ఉద్యోగాల కోసం ప్రతిపాదించిన తీరు హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఏడుగురిని ప్రతిపాదించగా అందులో ఒకే కుటుంబానికి చెందినవారు నలుగురు ఉన్నారు. దీంతో ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు ఆలయ అధికారులు ముందుకు రాకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇతర జిల్లాకు చెందిన మరో మంత్రి ఆ ఏడుగురిని కాదని.. నలుగురితో మరో ఉత్తర్వులను సంబంధిత దేవాదాయశాఖ ఉన్నతాధికారితో జారీచేయించి తన పట్టు నిలుపుకొన్నారు.