ఆదిలాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రూ.2 లక్షల రుణమాఫీ ఆదిలాబాద్ జిల్లాలో ప్రహసనంగా మారింది. జిల్లాలో 90 వేల మంది రైతులకు బ్యాంకు ఖాతాలు ఉండగా నాలుగు విడతల్లో 62,298 మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మూడో విడతలో 55,600 మంది రైతులకు రుణమాఫీ చేయగా వివిధ కారణాల వల్ల చాలామంది రైతులు రూ.2 లక్షల రుణమాఫీకి దూరమయ్యారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పలు కారణాలతో రుణమాఫీ కాలేదని తెలిపింది. రేషన్‌కార్డు లేని వారు, కుటుంబాల నిర్ధారణ కానివారు, ఆధార్‌కార్డుల్లో పొరపాట్లు, బ్యాంకు ఖాతాల్లో తప్పులను సవరించడానికి సర్వే చేపట్టారు. సర్వేలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి వారి కుటుంబాలతో సెల్ఫీలు దిగి యాప్‌లో అప్లోడ్ చేశారు. జిల్లావ్యాప్తంగా 18 వేల మంది కుటుంబ నిర్ధారణ కాలేదని గుర్తించారు.
కేథార్పూర్లో విచిత్ర పరిస్థితి
జైనథ్ మండలంలోని కేథార్పూర్కు చెందిన 90 మంది రైతులు గిమ్మ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్‌లో రుణాలు తీసుకున్నారు. వీరిలో రూ.2 లక్షల లోపు బ్యాంక్ లోన్ ఉన్న రైతులు 50 మంది ఉంటారు. ప్రభుత్వం నాలుగు విడతలుగా 2 లక్షల రుణమాఫీ ప్రకటించగా.. ఈ గ్రామంలో కేవలం ఆరుగురికి మాత్రమే మాఫీ వర్తించింది. ఇందులో ఇద్దరు రైతులు రూ.1.20 లక్షలు బాకీ ఉంటే రూ.80 వేల చొప్పున అరకొర మాఫీ జరిగింది. నాలుగో విడతలో మరో ముగ్గురికి మాఫీ చేసినట్టు ప్రకటించినా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఇంకా జమకాలేదు. అధికారుల చుట్టూ తిరిగి వేసారిన రైతులు రుణమాఫీపై ఆశలు వదులుకున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో రుణమాఫీ పరిస్థితి ఇలాగే ఉన్నది.
85 వేలు మాఫీ కాలేదు
నాకు ఎకరంన్నర భూమి ఉన్నది. పత్తి వేసిన. జైనథ్ మండలం గిమ్మలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 85 వేలు లోన్ తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ నాకు వర్తించలేదు. వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే దరఖాస్తు ఇస్తే చేస్తమన్నారు. మూడుసార్లు దరఖాస్తు ఇచ్చినా ఫలితం లేదు. నాలుగు నెలల నుంచి బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మాఫీ ఆశలు వదులుకున్నా.
– రవీందర్, రైతు, కేథార్పూర్, జైనథ్ మండలం
నాలుగు నెలలుగా తిరుగుతున్నం
నాకు రెండెకరాల భూమి ఉన్నది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ. లక్ష క్రాప్‌లోన్ తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీలో నా లోన్ మాఫీ కాలేదు. నాలుగు నెలల నుంచి బ్యాంకు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. లిస్ట్‌లో మీ పేరు లేదు. మేమేమీ చేయలేమని బ్యాంకు అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం మీకు లోన్ మాఫీ కాదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.
– సంతోష్, రైతు,కేథార్పూర్, జైనథ్ మండలం, ఆదిలాబాద్