మంచిర్యాల, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఆచరణలో చేతులెత్తేసింది. 30శాతం మందికే రుణమాఫీ చేసి మిగిలిన వారికి టోపీ పెట్టింది. మాఫీ కోసం ఆశగా చూసిన రైతాంగానికి బ్యాంకుల్లో చీత్కారాలే ఎదురయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నియోజకవర్గంలోని గ్రామాలను ‘నమస్తే తెలంగాణ’ బృందం మంగళవారం సందర్శించింది. మంచిర్యాల నియోజకవర్గంలోని ముల్కల్లలో(ముల్కల్ల+పోచంపాడు శివారు కలుపుకొని) 1040 మంది రైతులు ఉన్నారు. తొలి విడుతలో 165 మందికి, రెండో విడుతలో 60 మందికి మాఫీ అయ్యింది.
మూడో విడుతలో ఎంత మందికి అయ్యిందో ఎవరికీ తెలియదు. మూడు విడుతల్లో కలిపి 300 మందికి కూడా రుణమాఫీ కాలేదని స్పష్టం చేసిండ్రు. ఈ లెక్కన గ్రామంలో 30 శాతం మందికే రుణమాఫీ అయ్యింది. చాలా మంది రైతులు ముల్కల్ల గ్రామీణ బ్యాంక్ దగ్గర, రైతు వేదిక దగ్గర కనిపించిండ్రు. బ్యాంకు దగ్గరున్న రైతులను ప్రశ్నిస్తే ‘మిత్తి పైసలు కట్టేందుకు వచ్చినం’ అన్నరు. గుడిపేట రైతు వేదిక దగ్గర అధికారుల కోసం రైతులు వచ్చారని తెలుసుకొని వెళ్లగా అక్కడ అదే పరిస్థితి. ‘మాఫీ కాలేదు.. 30వ తేదీ దాకా ఆగమన్నరు. గవర్నమెంట్ నుంచి ఆదేశాలు అచ్చినంక మిత్తి కట్టుడా.. మొత్తమే మాఫీ చేసుడా తెలుస్తది’ అని రైతులు చెప్పారు. బ్యాంక్‌కు వెళ్లి మిత్తి కట్టి రైతు వేదిక దగ్గరకు వచ్చిన రైతుల ముఖాలు తెల్లబోయాయి. మనిషికో సమాధానం చెప్పి గందరగోళం చేసుడు ఏందంటూ మండిపడ్డారు. వ్యవసాయ పనులు వదులుకొని బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
రేషన్‌కార్డు లేకపోతే రైతును కాదా ?
రూ. 2 లక్షలు దాటిందని మాఫీ కాలేదు. రూ.16 వేలు మిత్తి కడితే సెప్టెంబర్ 30 వరకు అయితదన్నారు. ఆ మిత్తి పైసలు బ్యాంక్‌లో కట్టేసిన. రేషన్‌కార్డు లేదని ల్యాండ్ పేపర్, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్‌కార్డు జిరాక్స్లన్నీ తీసుకొని రమ్మని సార్లు చెప్పిన్రు. కేసీఆర్ సర్కారు రుణమాఫీ చేసినప్పుడు ఇవ్వేమి అడగలేదు. సీదా రూ.60వేలు మాఫీ అయినయ్. ఈసారి గిన్ని చిక్కులు పెట్టిండ్రు. రేషన్‌కార్డు లేకపోతే రైతును కాదా ? రుణమాఫీ కాదా ? – బేర ప్రభాకర్, ముల్కల్ల
రుణమాఫీ చేస్తారో ? లేదో ?
పోయినేడాది కేసీఆర్ సర్కారు రూ.లక్ష రుణమాఫీ చేసింది. అది రెన్యూవల్ చేసి రూ.2 లక్షలు తీసుకున్న. రేషన్‌కార్డు ఉన్నది. గ్రామీణ బ్యాంక్ ముందే మా ఇల్లు. రెండు లక్షలకు రూ.15 వేలు మిత్తి అయ్యింది. బ్యాంక్‌లో రూ. 15 వేలు కట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికిపోతా. రుణమాఫీ చేస్తరో చేయరో తెల్వదు. మా ప్రయత్నమైతే చేస్తున్నాం.
– బోయిని మహేశ్, ముల్కల్ల
తిరగలేక యాష్టకస్తుంది
మాది ముల్కల్ల పక్కనే ఉన్న పెద్దంపేట. నా పేరున రూ.1.10లక్షలు, నా భార్య పేరుమీద రూ.లక్ష లోన్ తీసుకున్నా. రూ.రెండు లక్షలు మాఫీ చేస్తారంటే మిగిలిన డబ్బులు, మిత్తితో కడతామని అధికారులకు చెప్పినం. మమ్ములను 30వతేదీ దాకా ఆగమన్నారు. నాతో పాటు వచ్చినోళ్లు కట్టారంట కదా.. నేను కూడా కడతా అంటే తొందరెందుకు పెద్దాయన అంటున్నరు. ఆ మాఫీ ఏమో కానీ తిరగలేక యాష్టకు వస్తాంది.
– అల్లంల పవ్వయ్య, శంకరమ్మ, పెద్దంపేట