హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): రోజుకు 10 వాట్సాప్ కాల్స్, 10 మెసేజ్‌లు.. అలా రెండు నెలల పాటు 1,200 ఫోన్లు, మెసేజ్‌లతో ఓ బీబీఏ విద్యార్థి(19)ని టార్చర్ పెట్టాయి రుణయాప్‌లు. చివరికి అతడి ఫొటోలు నగ్నంగా మార్చి అతడికే పంపి బ్లాక్మెయిల్ చేశాయి. దీంతో కంగుతిన్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకెళితే.. మేడ్చల్‌లోని వినాయకనగర్‌కు చెందిన 19 ఏండ్ల బీబీఏ విద్యార్థి మే 25న హనీ లోన్‌యాప్ నుంచి రూ.13 వేలు రుణం తీసుకొన్నాడు. తీసుకొన్న రెండు రోజులకే రుణం చెల్లించాలని మెసేజ్‌లు మొదలయ్యాయి. మీకు సహాయంగా మరో యాప్ నుంచి రుణం ఇప్పిస్తామని ప్రోత్సహించారు. కానీ ఆ విద్యార్థి రుణం తీసుకోలేదు. వారానికి తీసుకొన్న రూ.13 వేల రుణాన్ని చెల్లించాడు. అయినా ఇంకా చెల్లించాల్సి ఉన్నదని వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు ప్రారంభమయ్యాయి. మే 25 నుంచి జూలై 13వ తేదీ వరకు నిత్యం ప్రతి రోజు 10 వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు పంపి నరకం చూపించారు. చివరికి మార్ఫింగ్ చేసిన అతడి ఫొటోను పంపి భయపెట్టారు. తొందరగా నిర్ణయం తీసుకోకపోతే ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న ఫోన్ నంబర్లన్నింటికీ పంపి చెడుగా ప్రచారం చేస్తామని బెదిరించారు. మొత్తం 13 యాప్‌లను డౌన్లోడ్ చేయించారు. అందులో రుణం తీసుకోకున్నా తీసుకొన్నట్టు బ్యాలెన్స్ ఉన్నది. మొత్తం 14 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బ్లాక్‌మెయిలింగ్‌కు తట్టుకోలేక అప్పుచేసి రూ. 14 లక్షలు కట్టాడు. అయినా వేధింపులు ఆగకపోవటంతో తనను కాపాడాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
ఉన్నతాధికారుల ఫొటోలతో ఫేక్ వాట్సాప్ డీపీలు
ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరుతో వచ్చే ఫేక్ మెసేజ్‌లు ఇటీవల అధికమయ్యాయి. కింది స్థాయి అధికారులను నమ్మించి, వారి నుంచి అత్యవసర సాయంగా డబ్బును సర్దుబాటు చేయాలంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో డీపీలు సృష్టించి, ఫేక్ మెసేజ్‌లు పంపుతున్నారు. ఇటీవలే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జీ రఘుమారెడ్డి ఫొటోను ఒక ఆగంతకుడు వాట్సాప్ డీపీగా పెట్టుకొని, సంస్థ ఉద్యోగులకు, ఇతర అధికారులకు మెసేజ్‌లు పంపాడు. ఇలాంటి మెసేజ్‌లకు స్పందించొద్దని టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు అప్రమత్తం చేశారు.
జలమండలిలో..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ సంస్థ ఎండీ దాన కిశోర్ పేరుతోనూ ఒక ఫేక్ వాట్సాప్ డీపీని క్రియేట్ చేశారు. ఈవిషయాన్ని సంస్థ అధికారులు ముందుగానే గుర్తించి, ఫేక్ వాట్సాప్ డీపీకి ఎవరూ స్పందించవద్దంటూ సంస్థ ఉద్యోగులను అప్రమత్తం చేశారు.
సైబర్ భద్రతకు ‘సేఫ్’ సూత్రం: ప్రజలకు నిపుణుల సూచనలు
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఇంటర్నెట్ యుగంలో సైబర్ భద్రత చాలా అవసరమని, సాంకేతికతను సరైన రీతిలో వాడుకోలేకపోతే సైబర్ నేరగాళ్లకు చిక్కి మోసపోయే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం సేఫ్‌గా ఉండాలంటే.. ‘సేఫ్(ఎస్ఏఎఫ్ఈ)’ సూత్రాన్ని అనుసరించాలని చెప్తున్నారు.
ఎస్: మీ పేరు, అడ్రస్, పనిచేస్తున్న సంస్థలు, చదువుతున్న సంస్థలు వంటి వ్యక్తిగత సమాచారం ఆన్లైన్లో ఎవరితోనూ షేర్(ఎస్) చేసుకోవద్దు.
ఏ: ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తున్నా, బెదిరిస్తున్నా, ఏదైనా సమాచారం కోసం అడుగుతున్నా వెంటనే మీకు నమ్మకస్తులైన పెద్దవారికి వివరాలు అందించి, మీ ఇబ్బందికి పరిష్కారాన్ని అడగాలి (ఆస్క్-ఏ).
ఎఫ్: సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో పరిచయాలు పెంచుకొని, వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అపరిచితులను ఎప్పుడూ ఫేస్ టు ఫేస్ (ఎఫ్) కలవొద్దు.
ఈ: ఆన్లైన్లో మర్యాదగా ప్రవర్తించడం (ఎటికేట్-ఈ) నేర్చుకోవాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే పోలీసులకు సమాచారమివ్వాలి.