హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన మూర్తి తన ఫోన్లో ఓ లోన్యాప్ను డౌన్లోడ్ చేశాడు. లోన్ తీసుకోవాలనుకొన్నా, మనసొప్పక తీసుకోలేదు. అప్పటికే ఆ యాప్‌లో ఆధార్, పాన్‌కార్డును అప్లోడ్ చేశాడు. రూ.5 వేల రుణానికి అర్హత ఉందంటూ సందేశం వచ్చినా పట్టించుకోలేదు. వారం గడిచింది.. మీరు తీసుకొన్న రుణానికి డబ్బు చెల్లించాలంటూ మూర్తికి ఫోన్ వచ్చింది. నేను రుణం తీసుకోలేదు, ఎందుకు చెల్లించాలని ప్రశ్నించాడు. రుణం తీసుకొన్నావంటూ అవతలివైపు నుంచి దబాయించారు.
ఏ ఖాతాలోకి క్రెడిట్ చేశారో చెప్పాలని అడిగితే స్పందన లేదు. పైగా, కాంటాక్టు లిస్ట్ మొత్తం తమ వద్ద ఉందంటూ బాధితుడి కాంటాక్టు లిస్ట్‌ని బాధితుడికే పంపించారు. రేపటి లోగా డబ్బు కట్టకపోతే ఆ ఫోన్ నంబర్లన్నింటికీ నువ్వొక రేపిస్ట్ అని, అసభ్యకర సందేశాలు, ఫొటోలు పంపిస్తామని హెచ్చరించారు. బాధితుడు లబోదిబోమంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.