స్టేషన్‌ఘన్‌పూర్, జనవరి 7 : బతికున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేశారు.. అధికారులు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడేనికి చెందిన వృద్ధుడు అన్నెపు వెంకటయ్య మూడేండ్లుగా ఆసరా పెన్షన్ పొందుతున్నాడు. ఈ క్రమంలో ఎనిమిది నెలలుగా పెన్షన్ రావడం లేదు. పెన్షన్ వస్తలేదని కొద్దిరోజులుగా పంచాయతీ అధికారులతోపాటు సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు పెన్షనర్ల జాబితాను పరిశీలించగా విస్తూపోయే అంశం వెలుగుచూసింది. ‘మీరు చనిపోయినట్టు లిస్టులో ఉంది.. పెన్షన్ రాదు.. పెన్షన్ కావాలంటే హైదరాబాద్‌కు వెళ్లి ఉన్నతాధికారులను కలవాలి’ అని సూచించారు. దీంతో బాధితుడు వెంకటయ్య కంగుతిన్నాడు. తాను బతికే ఉన్నానని, నిలిపివేసిన పెన్షన్‌ను అందించాలని వేడుకుంటున్నాడు.