పోచమ్మమైదాన్, మార్చి 22: హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన సంస్కృతాంగ్ల సాహితీవేత్త ఆచార్య ఎస్ లక్ష్మణమూర్తి (86) హైదరాబాద్‌లో శనివారం కన్నుమూశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లకు చెందిన పెరంబుదూరు రాఘవాచార్య, తాయమ్మ దంపతులకు 1940 జూలై 19న లక్ష్మణమూర్తి జన్మించారు. ఎంఏ ఇంగ్లిష్, సంస్కృతం, జర్మన్ భాషలో ఎంఫిల్, పీహెచ్డీ చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఇంగ్లిష్ హెచ్వోడీగా, ఫ్యాకల్టీ ఆఫ్ డీన్‌గా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా పనిచేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పదవులు చేపట్టారు. 1980లో అమెరికా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
అమెరికాకు రెండు పర్యాయాలు ఫుల్ టైమ్ స్కాలర్ (ఫెలోషిప్)గా వెళ్లి పలు విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. అమెరికన్ నవలా రచయిత విలియ స్ట్రేరన్పై పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంపై అక్కడి రచయితలు.. లక్ష్మణమూర్తిని బెస్ట్ ప్రొఫెసర్‌గా అభివర్ణించారు. అమెరికన్, ఇండియన్ సాహిత్యంలో ఉపన్యాసాలు ఇచ్చి దేశ గౌరవాన్ని నిలబెట్టారు. 1961లో నరసరావుపేటలో జరిగిన పొట్టి శ్రీరాములు స్మారక ఉపన్యాస పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించారు. కవి, రచయితగా సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థకు మార్గదర్శిగా, మిత్రమండలి సంస్థకు పలు రకాల సేవలు అందించారు. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాషల్లో పద్య కావ్యాలు, వ్యాస సంపుటాలు రచించారు. ‘గోపికా వల్లభ, సమర్పణం’ పద్య కావ్యాలు, ఉపనిషత్తులు, గీతాంజలి, గడప దేహాళి తదితర వ్యాస సంపుటాలు రాశారు.
ఆయన పర్యవేక్షణలో కాకతీయ యూనివర్సిటీలో అనేకమంది ఎంఫిల్, పీహెచ్డీ చేశారు. అనేక యూనివర్సిటీల్లో ఇంగ్లిష్, సంస్కృత సాహిత్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. వేదాంత శాస్ర్తాన్ని లోతుగా అభ్యసించి, కూలంకషంగా చర్చించారు. నేషనల్ బుక్ ట్రస్ట్‌కు ఇంగ్లిష్‌లో అనేక పుస్తకాలు పంపారు. లక్ష్మణమూర్తి మృతి పట్ల సహృదయ సంస్థ సభ్యులు గిరిజామనోహరబాబు, కుందావఝల కృష్ణమూర్తి, వనం లక్ష్మీకాంతారావు, డాక్టర్ ఎన్వీఎన్ చారి, మిత్ర మండలి బాధ్యులు అంపశయ్య నవీన్, నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి సంతాపం ప్రకటించారు. లక్ష్మణమూర్తి మృతితో వారి శిష్యులు, అభిమానులు, సాహితీవేత్తలు శోకసంద్రంలో మునిగారు.