హైదరాబాద్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ) : మద్యం దుకాణాల దరఖాస్తుల విక్రయాల్లో నిర్దేశించుకున్న అంచనాలను అందుకుంటామని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పేర్కొన్నారు. ‘కిక్కివ్వని మద్యం టెండర్లు’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. తాము అంచనా వేసినట్టుగానే జిల్లాల్లో మద్యం టెండర్లు పడుతున్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో రద్దీని తట్టుకునేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రెండేళ్ల క్రితం చివరి రెండు రోజుల్లో 45వేల నుంచి 50వేల దరఖాస్తులు వచ్చాయని ఇప్పుడు కూడా చివరి మూడు రోజుల్లో అంతకు మించి దరఖాస్తులు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. చివరి రోజుల్లో భారీగా వచ్చే అంచనాల మేరకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.