హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం ఆనవాయితీ. సిండికేట్లకు అవకాశం ఇవ్వకుండా, లక్కీ లాటరీలో లైసెన్స్ ఎవరికి దక్కిందో వారే దుకాణం నిర్వహించేలా చూడటం ఈ విధానం ప్రధాన లక్ష్యం. లేదంటే విచారణ లేకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేయవచ్చు. ఇది ఎక్సైజ్ చట్టం. కానీ, ఇప్పుడు ఈ చట్టాన్ని తుంగలో తొక్కుతూ లికర్ వ్యాపారంలో కొత్త ట్రెండ్ మొదలైంది. లాటరీ ద్వారా లైసెన్స్‌లు పొందిన వ్యాపారులు బ్లాక్ మార్కెట్లోకి వచ్చారు. తమ లైసెన్స్‌లను వేలానికి పెట్టారు. లకు తగలని పాత సిండికేట్లు కొత్త లైసెన్స్‌దారుల నుంచి దుకాణాలు తీసుకుంటున్నారు. దుకాణం డిమాండ్‌ను బట్టి రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు లైసెన్స్‌లను లీజుకు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రూ.5వేల కోట్ల మేర బేరాలు జరిగినట్టు ఎక్సైజ్‌శాఖలో చర్చ జరుగుతున్నది. ఈ తతంగం అంతా ఎక్సైజ్ పోలీస్స్టేషన్లలోనే జరుగుతుండగా, ఎక్సైజ్ అధికారులే మధ్యవర్తులుగా మారి ఒప్పందపత్రాలు రాయిస్తుండటం కొసమెరుపు.
రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు ఎక్సైజ్‌శాఖ ఇటీవల లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లు కేటాయించారు. పాత లైసెన్స్‌దారుల గడువు ఈ నెల 30తో ముగియనున్నది. డిసెంబరు 1 నుంచి కొత్త లైసెన్స్‌లు అమల్లోకి వస్తాయి. రెండేండ్లు మనుగడలో ఉంటాయి. ప్రభుత్వం మొదటి నుంచీ ఖజానాకు భారీ ఆదాయం స మకూర్చుకోవడమే లక్ష్యంగా అడ్డగోలుగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తు ధరలు పెంచింది. ఎక్సైజ్ నిబంధనలు సడలించి పొరుగు రాష్ట్రం వారిని కూడా వ్యాపారంలోకి ఆహ్వానించింది. సొంత రాష్ట్రంలోని గౌడ్లు, ఎస్సీ ఎస్టీలతో సమానంగా పొరుగు రాష్ర్టాల వారికి కూడా దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలుచేసింది. మరోవైపు సాధారణ దరఖాస్తుదారుకు వ్యాపారంలో కనీస అనుభవం ఉన్న దా? లేదా? లైసెన్స్‌లు కేటాయిస్తే వ్యాపారం చేసుకోగలరా? అనే కనీస అర్హతలను పరిశీలించకుండా దరఖాస్తులు స్వీకరించింది.
వచ్చిన దరఖాస్తులు సరిపోలేదని మరోసారి గడువు పెంచింది. దరఖాస్తుల ద్వారానే రూ.2,854 కోట్లు ఆర్జించింది. పొరుగు రాష్ట్రం వాళ్లు, గృహిణులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నిజానికి ఈ ఏడాది అటువంటి వారినే అదృష్టం వరించింది. ఇలా మొదటిసారి లాటరీ తగిలిన వాళ్లు ఇప్పుడు తమ లైసెన్సులను లీజు పేరుతో బ్లాక్ మార్కెట్లో పెట్టారు. ఆయా దుకాణాల అమ్మకాల సగటును బట్టి రూ.80 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు రేటుతో లైసెన్స్‌లను మరొకరికి లీజుకు ఇచ్చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని పాత రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతా ల్లో ఒక్కొక్క మద్యం దుకాణానికి రూ.3 కోట్ల వరకు బ్లాక్ మార్కెట్లో ధర పలికినట్టు ప్రచారం జరుగుతున్నది. నార్సింగి, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, శం షాబాద్, చేవెళ్ల, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఉప్పల్ తదితర ఎక్సైజ్ పోలీసుస్టేషన్ల పరిధిలో ఒక్కొక్క మద్యం దుకాణం లైసె న్స్ లీజు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వర కు ధర పలికినట్టు సమాచారం. జిల్లాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ ఒకో దుకాణం అమ్మకం స్థాయి బట్టి రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకు చేతులు మారినట్టు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉండగా, దాదాపు 1,900 దుకాణాల లైసెన్స్‌లు లీజు పేరుతో చేతులు మారినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మద్యం వ్యాపారం చేయకుండానే రూ.5 వేల కోట్లు చేతులు మారినట్టు ఎక్సైజ్ వర్గాల్లో అంచనా వేస్తున్నారు. 80% మద్యం దుకాణాలు పాత సిండికేట్ల చేతుల్లోకే వెళ్లిపోయాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ హైదరాబాద్‌కు సమీపంలోని ఒక జిల్లాలో పరిస్థితిపై ఆరా తీయగా 85% మద్యం దుకాణాలు సిండికేట్ల చేతుల్లోకి వెళ్లాయని తేలింది. జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ఉన్న మద్యం దుకాణాలు కనిష్ఠంగా రూ.1.2 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.3.7 కోట్ల వరకు ధరతో లైసెన్స్‌లు చేతులు మారినట్టు తెలిసింది.
రూ.కోట్లు పెట్టి లైసెన్స్ లీజుకు తీసుకుంటున్న సిండికేట్లు తిరిగి తమ పెట్టుబడిని ఎలా రాబట్టుకుంటారనే దానిపై చర్చ జరుగుతున్నది. ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయం మినహా మరో మార్గం లేదని అంటున్నారు. పదేండ్ల నుంచి ఎమ్మార్పీ ధరలను కఠినంగా అమలుచేశారు. ఉల్లంఘించిన దుకాణదారుల మీద కేసులు పెట్టారు. కానీ, ఈ సారి కనీవినీ ఎరుగనంత ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతుందని ఎక్సైజ్‌శాఖలో చర్చ జరుగుతున్నది. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ ధర మద్యం దుకాణాల్లో రూ.15, బెల్టు దుకాణాల్లో రూ.30 చొప్పున పెరుగుతాయని చెప్తున్నారు. ప్రస్తుతం రూ.160 విలువైన క్వార్టర్ బాటిల్ మద్యం దుకాణాల్లో రూ.175 చొప్పున, బెల్ట్ కౌంటర్లో రూ.190 చొప్పున విక్రయిస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పాత మద్యం సిండికేట్లు బీరుపై ఎమ్మార్సీ రూ.180 ఉండగా, బెల్ట్‌లో రూ.220లకు అమ్ముతున్నారు.
లైసెన్స్‌దారు స్థానంలో మరొకరు వ్యాపారం చేయడం ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధం. కానీ, ఎక్సైజ్ పోలీస్స్టేషన్లలోనే లైసెన్స్ లీజు దందా నడుస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులే గతంలో దుకాణం ఎంత నడిచిందో లెక్కలు తీసి, దానిని బట్టి రేటు ఫిక్స్ చేయిస్తున్నారని సమాచారం. ఒక్క ఒప్పంద పత్రానికి స్టేషన్ ఎస్ఐ నుంచి మొదలుకొని డీసీ వరకు రూ.3.5 లక్షల మా మూళ్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది. అయినా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్తోపాటు ఏసీబీ దృష్టిపెట్టడం లేదని మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా లైసెన్స్ లీజు వ్యవహారం జరుగుతున్నా.. సిండికేట్లను పట్టుకొకుండా ఎన్డీపీఎల్ మద్యం, గంజాయి అంటూ హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ తరహా దందాపై ఏసీబీ ఉక్కుపాదం మోపింది. ఆ సమయంలో ఎక్సైజ్‌శాఖలో సగం మంది అధికారులు కేసుల పాలయ్యారు.