హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తొలిమెట్టు తరహాలోనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (ఎల్ఐపీ) నిర్వహించాలని భావిస్తున్నది. దీనిపై గురువారం హైదరాబాద్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, ఎస్ఈఆర్టీ అధికారులతో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఎల్ఐపీపై క్షేత్రస్థాయిలో నివేదికలు రూపొందించాలని జిల్లా అధికారులకు సూచించారు. మే 8న మార్గదర్శకాలు చేస్తారని సమాచారం. కాగా, రాష్ట్రంలోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను మరింత బలోపేతం చేయాలని విద్యాశాఖ భావిస్తున్నది. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈసారి టీచర్ తనకు నచ్చిన సబ్జెక్టు ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఇవ్వాలని భావిస్తున్నది.