హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో అరెస్టయిన నందు వ్యవహారం తవ్వినకొద్దీ బయటపడుతున్నది. పూర్తిపేరు నందు కుమార్ కోరె. అతడు హోటల్ యజమానిగా మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. కానీ, నేర ప్రపంచానికి అతడో దళారిగా, మోసగాడిగా, కుట్రదారుడిగా, ఇతరులను ప్రలోభ పెట్టేవాడిగా సుపరిచితుడని తెలుస్తున్నది. నందుపై గతంలో 20కి పైగా కేసులు నమోదయ్యాయంటేనే అతడి నేర చరిత్రను అర్థం చేసుకోవచ్చు. అందులో గంజాయి సరఫరా కూడా కీలకమైన కేసు కావడం గమనార్హం. ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన గోవాకు చెందిన డ్రగ్స్ డీలర్ ఎడ్విన్తోనూ నందుకు మంచి సంబంధాలే ఉన్నాయని సమాచారం. ఎడ్విన్‌తో కలిసి నందు గోవాకు కూడా వెళ్లినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నందు డీలింగ్స్ అన్నీ కోట్లలోనే సాగుతుంటాయి. ఇతడికి ప్రమోద్‌కుమార్ పచ్వా అనే ఓ పార్ట్నర్ కూడా ఉన్నాడు. నకిలీ కంపెనీలు ప్రారంభించడం, అందులో ఉద్యోగులను సృష్టించడం, కంపెనీ, ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల డబ్బును మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడటం ప్రమోద్‌కు వెన్నతో పెట్టిన విద్య.
నందు, ప్రమోద్ కలిసి ఎంతోమందిని మోసం చేసి డబ్బులు వసూలుచేసి.. ఎగ్గొట్టారు. వీరి టార్గెట్ మొత్తం అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధులే. అక్రమంగా సంపాదించిన డబ్బును ఇస్తే పెట్టుబడిగా పెడతామని లేదా మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు పంపిస్తామని.. రకరకాలుగా నమ్మించి డబ్బు తీసుకొని ఉడాయిస్తుంటారు. అవినీతి సొమ్ము కాబట్టి ఎవరూ పోలీసులకు ఫిర్యాదుచేసే అవకాశమే లేదు. అంతేకాదు.. ఖరీదైన భవనాలను లీజుకు తీసుకొంటారు. కొన్నాళ్ల తర్వాత ఆ భవనానికి సంబంధించి దొంగ పత్రాలు సృష్టించి అసలు యజమానులను ఇబ్బంది పెడుతుంటారు. 2017లో ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెట్ జ్యోతికిరణ్ కేసుతోనూ వీరిద్దరికీ సంబంధం ఉన్నది. జ్యోతికిరణ్ కేసులో ఏసీబీ అధికారులు ప్రమోద్, నందు ఇండ్లను తనిఖీ చేశారు. జ్యోతికిరణ్ తాను అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రమోద్, నందుకు ఇచ్చి వారిద్వారా ఆస్తులు కొనుగోలు చేసేవాడని సమాచారం. అంతేకాదు.. జ్యోతికిరణ్ వారిద్దరి చేతిలో మోసపోయాడు కూడా. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దుకు కొన్ని రోజుల ముందు జ్యోతికిరణ్ వారిద్దరికీ రూ.2 కోట్లు ఇచ్చాడు. ఎక్కడైనా భూమి కొనుగోలు చేయాలని చెప్పాడు. సరిగ్గా అప్పుడే కేంద్రం పెద్దనోట్లను రద్దుచేసింది. దీంతో ప్రమోద్, నందు కలిసి జ్యోతికిరణ్కు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు.