డోర్నకల్, జూన్ 14 : పెండ్లిరోజు జరుపుకొన్న మరుసటి రోజే కరెంట్ షాక్‌తో విద్యుత్తు ఉద్యోగి మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. డోర్నకల్ సబ్‌స్టేషన్‌లో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న క్రాంతికుమార్(32) మున్నేరువాగు సమీపంలో ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా, కరెంటు తీగ తగిలి విద్యుత్తు షాక్‌కు గురయ్యాడు. స్థానిక రైతు గమనించి ఏఈ కిరణ్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు సీపీఆర్ చేసి, పంట పొలాల మీదుగా బైక్‌పై తీసుకొచ్చి 108 వాహనంలో మహబూబాబాద్ ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని ఏఈ కిరణ్, ఎస్సై ఉమ పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్రాంతికుమార్‌ది నర్సింహులపేట మండలం. ఈ నెల 13న క్రాంతికుమార్ మ్యారేజ్ డేగా చేసుకొని కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపాడు. మ్యారేజ్ డే మరుసటి రోజే మృత్యువాతపడటంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకున్నది.