హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ, ఏపీల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నది. పశ్చిమ దిక్కు నుంచి వచ్చే గాలులు తెలంగాణ మీదుగా తక్కువ ఎత్తులో వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో కొన్ని చోట్ల వేడిగాలులు వీచే అవకాశమున్నదని చెప్పారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగింది. పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి.