Weather Update | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భానుడి తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం 9గంటల నుంచే ఎండలు మండుతుండటం, మధ్యాహ్నం వేళల్లో వడగాడ్పులు అధికమవ్వడంతో ప్రజలు బయటకురావటానికి జంకుతున్నారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసినట్టు పేర్కొన్నది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా, భద్రాద్రి-కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో 41.4, ఆదిలాబాద్, జోగులాంబ-గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, వనపర్తి జిల్లాల్లో 41.3, నిర్మల్ జిల్లాలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. అలాగే ఏప్రిల్ 2,3,5న గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లవేగంతో ఈదురుగాలులు వీస్తూ.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది.