Kaleswaram | కరీంనగర్, జూలై 28(నమస్తే తెలంగాణ)/ధర్మారం/రామడుగు: కాళేశ్వరగంగ పరవళ్లు తొక్కుతున్నది. లింక్-2లో ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు జలాశయానికి పరుగిడుతున్నది. పెద్దపల్లి జిల్లా నంది పంప్‌హౌస్‌లో 4, 5, 6, 7 మోటర్ల ద్వారా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఒక్కో మోటర్ ద్వారా 3,150 చొప్పున 12,600 క్యూసెక్కులు డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలుతున్నాయి.
ఇక్కడా నాలుగుమోటర్ల(1, 2, 3, 4)ద్వారా 12,600 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తుండగా, గ్రావిటీ కాల్వ ద్వారా ఎస్సారెస్పీ వరద కాల్వలోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర జలాశయం(మధ్యమానేరు)కు చేరుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి సుమారు ఒక టీఎంసీ జలాలను మధ్యమానేరుకు తరలించినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.