Insurance for Sanitation Workers | హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పారిశుద్ధ్య కార్మికులు మరణిస్తే.. వారి అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్ (ఎంపీడబ్ల్యు) లు సర్వీసులు ఉండగా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు వర్తించే విధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పంచాయతీల్లో పని చేసే మల్టీ పర్పస్ వర్కర్లకు ఎల్ఐసీ ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అమలు చేస్తారు. వీరికి ఖర్చయ్యే బీమా పాలసీ మొత్తం సంబంధిత గ్రామ పంచాయతీ చెల్లిస్తుంది. ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడికి ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. సర్వీసులో ఉన్న కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.
దీంతో పాటు సర్వీసులో ఉన్న కార్మికులు చనిపోతే వారి దహన సంస్కారాలకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ.5000 మొత్తం అడ్వాన్స్ రూ.10వేలకు పెంచారు. ఈ మొత్తాన్ని సంబంధిత గ్రామ పంచాయతీ చెల్లించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఈ రెండు పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.