పటాన్చెరు, ఏప్రిల్ 16: 2003 నుంచి దాదాపు పది మంది మహిళలను హత్య చేసి ఆభరణాలు దొంగిలించిన నిందితుడికి సంగారెడ్డి కోర్టు జీవిత ఖైదును విధించింది. మంగళవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డిజిల్లా ఆరుట్లకు చెందిన మాయ ని రాములు అలియాస్ మన్నె సాయిలు (42) డ్రైవర్. 2019 జూలై 11న రం గారెడ్డి జిల్లా గండీడ్ మండలం నాంచర్ల గ్రామానికి చెందిన అంజలమ్మ (40)ను చేవెళ్ల బస్టాండ్ వద్ద తన వాహనంలో ఎక్కించుకొని పటాన్చెరు మండలం లక్డారానికి తీసుకొచ్చాడు. లింగసానికుం ట వద్ద గొంతునులిమి చంపి, రూ.120 నగదు, సెల్‌ఫోన్ దొంగిలించాడు.
2003 లో ఓ మహిళను తూప్రాన్‌లో గొంతునులిమి చంపి వెండి ఆభరణాలు దొంగిలించాడు. 2016లో ఆరుట్లలో ఓ మహిళ గొంతునులిమి చంపాడు. 2008లో బాచుపల్లి పరిధిలో మరో మహిళను కొట్టిచంపాడు. 2008లో నర్సాపూర్‌లో ఒక మహిళను చంపి, వెండి ఆభరణాలు దొంగిలించాడు. 2009లో నార్సింగి ఏరియాలో మాచునూర్ జింకల పార్కు వద్ద మహిళను హత్యచేసి వెండి ఆభరణాలు తస్కరించాడు. కూకట్పల్లి జన్మభూమి కాలనీలో మహిళను చంపి చెవికమ్మలు, బంగారు గొలుసు దొంగిలించాడు. అల్విన్ కాలనీ మహంకాళి టెంపుల్ అమ్మవారి మెడలో నుంచి 10 గ్రాముల గోల్డ్‌చైన్ దొంగతనం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇతనిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇతని నేరాలను కోర్టులో సాక్ష్యాధారాలతో రుజువు చేయడంతో మంగళవారం సంగారెడ్డి 2వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్ డాక్టర్ పీపీ కృష్ణా అర్జున్ నిందితుడికి జీవిత ఖైదు విధించారు. రూ.3 వేల జరిమానా విధించారు.