హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో లైసెన్స్డ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మేలో చేయాల్సిన లైసెన్సుల రెన్యువల్‌ను ఇప్పటివరకూ చేయలేదు. ఫలితంగా పనుల టెండర్లలో పాల్గొనే అర్హత లేకుండా, చేసిన పనులకు బిల్లులు తీసుకోకుండా కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా లైసెన్స్‌లు రెన్యువల్ చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా జరిగే టెండర్లలో వారు పాల్గొనలేకపోతున్నారు. ఈ విషయంపై పలుసార్లు ప్రభుత్వానికి చెప్పినా ఎలాంటి స్పంద న రాలేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. జనవరి, ఫిబ్రవరిలో చేసిన పనుల కోసం బిల్లులు పెట్టుకోవాలనుకుంటున్న సమయంలో వారి ఎలక్ట్రికల్ లైసెన్సులు రెన్యువల్ కాలేదు. దీంతో ఆయా బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పనులు చేసేందుకు టెండర్లు వేయాలంటే లైసెన్స్ రెన్యువల్ లేక టెండర్లో పాల్గొనలేకపోతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 550 ఏ గ్రేడ్ లైసెన్స్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. సూపర్వైజర్ పర్మిట్లు సుమారు 500, వైర్‌మెన్ పర్మిట్లు 300 వరకు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.
విద్యుత్తు తనిఖీ అధికారి (సీఈఐజీ) లేకపోవడంతోనే లైసెన్స్‌లు రెన్యువల్ కావడం లేదని, కొత్త లైసెన్స్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తున్నది. ఈ పోస్ట్‌కు ఉన్న ప్రాధాన్యం మేరకు మరింత డిమాండ్ పెంచడానికే ప్రభుత్వం నియామకం విషయంలో తాత్సారం చేస్తున్నదని కాంట్రాక్టర్లే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్ట్‌కు రావడానికి పలువురు అధికారులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమై ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నారని సమాచారం. సీఈఐజీ పోస్టకు రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు డిమాండ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో వినియోగదారులు, కాంట్రాక్టర్ల ఇబ్బందులు పట్టించుకోకుండా కేవలం తమ ప్రయోజనాల కోసమే ప్రధాన అధికారితోపాటు డిప్యూటీ పోస్టులు కూడా నింపడం లేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఈ అధికారులు లేకపోవడంతో లైసెన్స్‌లు ల్యాప్స్ అయ్యే పరిస్థితి కూడా ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్పీడీసీఎల్ (ఉత్తర డిస్కం)లో అక్కడి యాజమాన్యం కాంట్రాక్టర్లకు కొంత వెసులుబాటు కల్పించింది. ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ చీఫ్ ఇంజినీర్ జూలై 25న ఈ మేరకు మెమో ఇచ్చారు. సీఈఐజీ పోస్ట్ ఖాళీగా ఉన్నందున కాంట్రాక్టర్లు రెన్యువల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు తాము రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న అక్నాలెడ్జ్మెంట్ కాపీతో టెండర్లలో పాల్గొనవచ్చని, ఈ అవకాశం అక్టోబర్ 31వరకు ఉంటుందని సూచించారు. సీఈఐజీ అధికారి నియామకం తర్వాత కచ్చితంగా నెలలోపు తమ లైసెన్స్ రెన్యువల్ కాపీని కార్యాలయంలో సమర్పించాలంటూ ఆ మెమోలో పేర్కొన్నారు. దీంతో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనే అవకాశం దక్కింది. కానీ ఎస్పీడీసీఎల్ (దక్షిణ డిస్కం) యాజమాన్యం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.