హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఖజానాను నింపుకొనేందుకే ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు నిర్ణయించిందని బీమా రంగ ఉద్యోగులు ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ సర్కారు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా శనివారం ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ధర్నాకు సంఘీభావంగా శుక్రవారం హైదరాబాద్‌లోని అన్ని డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే సోషల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జీ తిరుపతయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో ఐసీఈయూ సీబీ-7 కార్యదర్శి వీ రమేశ్‌గౌడ్, అధ్యక్షుడు మహేశ్, శర్మ, శివ, సురేశ్, శ్రీను, ఆదిరెడ్డి, ఇంద్ర, సుమ, ప్రతిభ, సుచిత పాల్గొన్నారు.