భీమదేవరపల్లి, సెప్టెంబర్ 22: తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆకాంక్షించారు. ‘నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి 2023-24 కథల పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు అధ్యక్షతన ఆదివారం జరిగింది. అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు పండుగలను మన ప్రాంతంలోకంటే విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్రంథాలయాలు విద్యార్థుల ప్రగతికి సోపానాలుగా నిలుస్తాయని చెప్పారు. ఇక్కడ చదువుకుని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వేముల శ్రీనివాసులు ముల్కనూరు ప్రజాగ్రంథాలయానికి చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ ప్రాంత అభివృద్ధికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, అల్గిరెడ్డి విశ్వనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దుగ్గిరాల వెంకట్రావు, శ్రీరంగారావు, వొడితెల రాజేశ్వర్‌రావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు పార్టీలకతీతంగా పనిచేశారని కొనియాడారు.
ముల్కనూరులో ప్రజాగ్రంథాలయం స్థాపించి పదేండ్లు పూర్తికావడం అభినందనీయమని అన్నారు. అమెరికా వంటి దేశాల్లో పిల్లలకు తెలుగునేర్పించడం కోసం ప్రత్యేకంగా టీచర్లను ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు మాట్లాడుతూ.. స్నేహితుల సహాయంతో తాము స్థాపించిన ముల్కనూరు ప్రజాగ్రంథాలయం పలువురు విద్యార్థుల విజయానికి దోహదపడటం సంతోషంగా ఉన్నదని అన్నారు. ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుని ఇప్పటివరకు 30 మంది వివిధ శాఖల్లో ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. అంతకుముందు కోడూరి రాజయ్య స్మారకార్థం నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లో విజేతలకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ చేతులమీదుగా బహుమతులను ప్రదానం చేశారు. చివరలో కథలపోటీల విజేతలకు ఆహుతుల చేతులమీదుగా బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బతుకమ్మ ఫీచర్స్ ఇంచార్జి టీ నాగరాజు, ఇఫ్లూ ప్రొఫెసర్ తిరుమతి కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ, మాజీ జడ్పీటీసీ వంగ రవి, డాక్టర్ ఎదులాపురం తిరుపతి, మాజీ సర్పంచులు గూడెల్లి రాజిరెడ్డి, మాడుగుల కొమరయ్య, గ్రంథాలయ నిర్వాహకులు గొల్లపల్లి లక్ష్మయ్య, తాళ్ల వీరేశం, పల్లా ప్రమోద్‌రెడ్డి, అయిత కిషన్‌ప్రసాద్, మూల శ్రీనివాస్, కోగూరి సుగుణాకర్, కరుణాకర్, మూల రాముగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మనిషి బతకడాని కి కూడు, గూడు, గుడ్డ ఎలా అవసర మో మానసిక వికాసానికి సాహిత్యం కూడా అంతే అవసరం. సాహిత్యాన్ని బతికించాల్సిన అవసరం అన్ని వర్గాలపై ఉన్నది. ప్రజలకు, కవులకు మధ్య సంబంధాలను పటిష్ఠం చేస్తున్న నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజాగ్రంథాలయానికి అభినందనలు.
కథలకు ఏకంగా యాభైవేల పారితోషికం ప్రకటించి సాహిత్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయ పీఠానికి కృతజ్ఞతలు. కనుమరుగవుతున్న సాహిత్యానికి ఊపిరిపోస్తున్న ఈ సంస్థలు భవిష్యత్తులోనూ ఇదే తరహా పోటీలను కొనసాగించాలి.
ప్రస్తుత సమాజంలో వేగం అలవాటైన సందర్భంగా కేవలం సంపాదనే ధ్యేయం గా ముందుకు సాగుతూ సాహిత్య బీజాలను మరిచిపోతున్నారు. నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా ఏటా నిర్వహిస్తున్న జాతీ య స్థాయి కథల పోటీల వల్ల సాహిత్యాభివృద్ధికి మంచి పరిణామం. పాఠశాల స్థాయిలోనే పిల్లలకు సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచేలా కృషి చేయాలి.
నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజా గ్రంథాలయం జాతీయస్థాయి కథల పోటీల నిర్వహణ ఏటా కొనసాగిస్తాం. మేము చేపట్టిన ఈ ప్రయత్నం వల్ల ఎంతోమందిలో నిగూఢంగా దాగి ఉన్న సాహితీ చాతుర్యం బహిర్గతం అవుతుంది. దీంతో ఎన్నో అందమైన కథలు పాఠకులకు అందించడం జరుగుతుంది. కొత్త రచయితలు పుట్టుకొస్తున్నారు.