చౌటుప్పల్, అక్టోబర్ 8: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించి తగిన బుద్ధి చెబుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిర్వహించిన ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పార్టీల నాయకులను కొనుగోలు చేస్తూ బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ అనేక కుయుక్తులకు తెరలేపిందని విమర్శించారు.
ఇందులో భాగంగా ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. మాట వినని ప్రతిపక్ష నాయకులపై ఈడీ దాడులు చేయిస్తున్నదన్నారు. బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సీపీఎం నాయకులపై అవాకులు, చవాకులు పేలుతున్నాడని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. బీజేపీకి అమ్ముడు పోయిన ఆయనకు నిస్వార్థంగా పనిచేసే కమ్యూనిస్టులపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాజగోపాల్రెడ్డి మూతికి తాళం వేసే విధంగా నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.