షాబాద్, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి గడప నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లి బీఆర్ఎస్ సత్తా చాటుదామని షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవనం సాగించేలా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టినట్టు గుర్తుచేశారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీని వదిలిపోయే వాళ్ల గురించి ఆలోచించాల్సిన అసరంలేదని తెలిపారు. గ్రామాల్లో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదని చెప్పారు.