హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ)/జూబ్లీహిల్స్: ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించిన వారి బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ అయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. సోమవారం యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలోప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ ట్రాఫిక్ వ్యవస్థ తీరుపై చిర్రుబుర్రులాడారు. ‘ఎవరి మీదైనా చలాన్ వేస్తే.. ఒక్క పైసా తగ్గించకండి. వాళ్ల బ్యాంక్ అకౌంట్ నుంచే నేరుగా డబ్బులు కట్ అయ్యేలా సింక్రనైజ్ చేయండి. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకోండి. ఇందుకు బ్యాంక్‌లతో సమన్వయం చేసుకోండి’ అంటూ ఆదేశాలు ఇచ్చారు. పాతచట్టాలను ప్రక్షాళన చేసి, కొత్త చట్టాలను తీసుకురావాలని సూచించారు. రవాణాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్‌లో బాధితులను దవాఖానకు తరలించాలని సూచించారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రజలంతా ఉద్యమంగా నడిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్, ఎమ్మెల్యేలు నవీన్, మకాన్సింగ్, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు.
22 వస్తువులతో విద్యార్థులకు కిట్
వేసవి సెలవులు ముగిసి, పాఠశాలల పునఃప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 22 వస్తువులతో కిట్ ఇచ్చే ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం నివాసంలో సెంట్రల్ ప్రొక్యూర్మెంట్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.