హైదరాబాద్, జనవరి13(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా దళితుల్లో అత్యంత వెనకబడిన 57 ఉపకులాల సాహిత్య సాంస్కృతిక జీవన చరిత్రను వెలికి తీస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ వెల్లడించారు. ఎస్సీ కులాలు, జాతుల సాహిత్య సాంస్కృతిక చరిత్రను గ్రంథస్తం చేయాలని కోరుతూ ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ చిందోళ్లు, హోలియదాసరులు, డక్కలి, బైండ్ల, మాల జంగాలు తదితర కులాల మౌఖిక సాహిత్యాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు. ఉపకులాల చరిత్ర ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదని, ఆ బాధ్యతను అకాడమీ త్వరలో చేపడతున్నదని వారికి హామీ ఇచ్చారు. గౌరీశంకర్‌ను కలిసిన వారిలో మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ తులసీదాస్, బుద్ధం నరసింహస్వామి తదితరులు ఉన్నారు.