Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ శివార్లలోకి ప్రవేశించిన చిరుత పులి.. ఓ ఆవుదూడపై దాడి చేసి చంపింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.
కడ్పల్ గ్రామానికి చెందిన రైతు తుకారాం తన పంట పొలంలోని ఓ రేకుల షెడ్డులో ఆవు దూడను కట్టేశాడు. అయితే మంగళవారం రాత్రి ఆ షెడ్డు వద్దకు చేరుకున్న ఓ చిరుత పులి ఆవు దూడపై దాడి చేసి చంపింది. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతు తుకారాం.. చనిపోయిన ఉన్న ఆవును చూసి షాకయ్యాడు. పోలీసులకు, అటవీశాఖ అధికారులకు తక్షణమే సమాచారం అందించాడు రైతు.
అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పులి పాదముద్రలను అధికారులు సేకరించారు. ఇక ఆ ఏరియాలో చిరుత సంచారంపై దృష్టి సారిస్తామన్నారు. గ్రామస్తులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. మొత్తానికి కడ్పల్ గ్రామస్తులతో పాటు సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.