బోథ్, నవంబర్ 29 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం బాబెర తండాలో చిరుతపులి పిల్ల దాడిలో గొర్రెలు మృతి చెందాయి. గ్రామస్థులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని అవునూరి రమేశ్‌కు చెందిన పశువుల పాకలోని గొర్రెలు, మేకల మందపై గురువారం రాత్రి చిరుత పులి పిల్ల దాడి చేయగా రెండు గొర్రెలు, గొర్రె పిల్ల మృతి చెందాయి.
ఓ మేకను తీవ్రంగా గాయపర్చి, మరో మేక పిల్లను ఎత్తుకెళ్లింది. మేకల అరుపులు విన్న రైతుతో పాటు చుట్టు పక్కల వారు కేకలు వేయడంతో చిరుతపులి పిల్ల అటవీ ప్రాంతం వైపు పారిపోయింది. బాధితుడికి తక్షణ సహాయంగా రూ.4500 అందజేసినట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రణయ్ తెలిపారు.