హైదరాబాద్, ఫిబ్రవరి17 (నమస్తే తెలంగాణ): కులగణన తీర్మానానికి చట్టబద్ధత తేవాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు సురేశ్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపడం హార్షనీయమని కొనియాడారు. కులగణన తీర్మానం అస్పష్టంగా ఉన్నదని, జ్యుడీషియల్ కమిషన్, ప్రత్యేక బిల్లు ప్రవేశపెడితే తెలంగాణ ప్రజానీకానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. చట్టబద్ధత లేకపోతే లక్ష్యం నెరవేరదని తెలిపారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కనీసం ఆరు మంత్రి పదవులను, 10 ఎంపీ సీట్లను కేటాయించాలని కోరారు. బీఆర్ఎస్ బీసీలకు కేటాయించిన నాలుగు మంత్రి పదవులనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించలేదని ధ్వజమెత్తారు. బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఈ వార్షిక బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీఎంవోలో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించలేదని విమర్శించారు.