హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మీడియా ప్రతినిధిపై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌బాబుపై చట్టప్రకారం నడుచుకుంటామని, ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. వీఐపీలు, సెలబ్రెటీల బౌన్సర్లు హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వచ్చే ఏడాది కొత్త డివిజన్లు, పోలీస్ స్టేషన్లతోపాటు రాచకొండ కమిషనరేట్ కమాండ్, కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నదని తెలిపారు. కొత్తగా విధుల్లోకి వచ్చే ఏఆర్ కానిస్టేబుళ్లకు సివిల్ పోలీసులతో సమానంగా విధులు కేటాయిస్తామని, అన్ని రకాలైన పనులు చేసేవిధంగా వారిని తీర్చిదిద్దుతామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకలను నిబంధనలకు లోబడి ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా పరిధి దాటి వ్యవహరించినా, డ్రగ్స్‌ను వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని రిసార్టులు, బార్లు, రెస్టారెంట్లు,పబ్బులపై నిఘా పెట్టినట్టు తెలిపారు.