హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్(నీట్-యూజీ) పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై లెఫ్ట్ విద్యార్థి సంఘాలు జాతీయస్థాయిలో పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 20న హైదరాబాద్‌లో తలపెట్టిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆహ్వానించారు. నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో శనివారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు సమన్వయకర్తగా వ్యవహరించగా, లెఫ్ట్ విద్యార్థి సంఘాల ప్రతినిధుల బృందం కేటీఆర్‌ను కలిసింది.
రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయనకు వివరించి, అధికారికంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు, విద్యారంగంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకునేందుకు లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, పీడీఎస్‌యూ(విజృంభణ), జీఆర్ పీడీఎస్‌యూ, ఏఐడీఎస్వో, ఏఐఎఫ్డీఎస్ సంయుక్తంగా ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.
కేటీఆర్‌తో భేటీ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీ పరీక్షల పేపర్లు లీక్ అవుతుండటం దురదృష్టకరమని మండిపడ్డారు. ఇటీవల నీట్ పేపర్ లీక్‌తో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ల లీక్ వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్‌తో సమావేశమైనవారిలో గ్యార నరేశ్, కిరణ్, అశోక్‌రెడ్డి, నాగరాజు, మహేశ్, అనిల్, శివ, నాగేశ్వరరావు, సుమంత్, మురళి, నితిశ్, శ్యామ్, శివ తదితరులు ఉన్నారు.