పెద్దకొత్తపల్లి, ఆగస్టు 4: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. స్థానిక ఎంపీ మల్లు రవిని స్థానికేతురుడుగా పేర్కొంటూ సొంత పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు. సోమవారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మాదాసి కురువ, మంత్రి జూపల్లి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు మల్లు రవికి వ్యతిరేకంగా రాస్తారోకో చేపట్టారు. ‘మల్లురవి గోబ్యాక్.. మల్లు రవి డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. కొల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత దండు నరసింహపై ఎంపీ మల్లు రవి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరి ఆందోళనతో రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై సతీష్‌కుమార్ ఆందోళనకారులతో మాట్లాడి సర్దిచెప్పడంతో రాస్తారోకో విరమించారు.