హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్‌రావు.. ఒక జాక్‌పాట్ అధ్యక్షుడు అని, ఆయనకు అనుకోకుండా వచ్చిన పదవి అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కొడుకు పుట్టకముందే కుల్ల కుట్టించినట్టు’గా రామచందర్‌రావు వ్యవహారశైలి ఉన్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ని ప్రజలు మరిచిపోయారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయనకు రాజకీయ పరిణతి లేదనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. అసలు ఆయన.. ఏ లోకంలో ఉన్నారో.. తెలంగాణలో ఉండే మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. ‘అల్లుడు వచ్చి అడుగుపెట్టగానే ఏదో.. జరిగింది’ అన్న సామెత మాదిరిగా, ఆయన అధ్యక్ష పీఠం ఎక్కగానే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు.
బీజేపీవి పగటికలలు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ రామచందర్‌రావు పగటికలలు కంటున్నారని, కానీ ఆ పార్టీ రాష్ట్రంలో ఎప్పటికీ మూడో స్థానం కోసం పోటీపడాల్సిందేనని మధుసూదనాచారి ఎద్దేవా చేశారు. ఎంఐఎం కన్నా.. ఒక్క సీటు ఎక్కువ తెచ్చుకోవాలనేది బీజేపీకి ఎప్పటికీ లక్ష్యంగానే ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు లోపాయికారిగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచినా.. ఈ రాష్ట్రానికి కేంద్రం చేసింది శూన్యమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు నిఖార్సయిన పార్టీ బీఆర్ఎస్ అని మధుసూదనాచారి స్పష్టంచేశారు.
పాశమైలారం దుర్ఘటన విషాదకరం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం దుర్ఘటన అత్యంత విషాదకరమని, చాలా బాధాకరమని మధుసూదనాచారి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం కలిసి ఆదుకోవాలని, వారి పిల్లల చదువులు పూర్తయ్యేంతవరకు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుని, వారికి భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్‌గౌడ్, బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు పాల్గొన్నారు.