Medha Patkar | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): మూసీ తీరంలో నిర్వాసితులతో కలిసి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని నర్మదా బచావో ఉద్యమకారిణి, హక్కుల నేత మేధాపాట్కర్ హెచ్చరించారు. హైదరాబాద్ వచ్చిన మేధా పాట్కర్ సోమవారం పాత మలక్‌పేట డివిజన్, శంకర్‌నగర్‌లోని మూసీ నిర్వాసితుల కాలనీల్లో ఆమె బాధితులతో మాట్లాడారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం తమ ఇండ్లను కూల్చివేసిందని వారు రోదించారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు నివసించేవని, మూసీ సుందరీకరణ పేరుతో తమ నివాసాలను కూల్చివేసిన అధికారులు, తమకు ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని వాపోయారు.
అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విలేకరులతో మాట్లాడారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా నివాసముంటున్న వారి ఇండ్లను కూల్చివేయడం విచారకరమని అన్నారు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే వారికి ఒకే డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తే వారు ఎలా నివాసముంటారని ప్రశ్నించారు. ప్రజలను ఒప్పించి ఆ తరువాత వారి నివాసాలను స్వాధీనం చేసుకొని తరలించాలి తప్ప బలవంతంగా తరలించడం తగదని అన్నారు. బాధితులను కలుసుకొనేందుకు వెళ్తే పోలీసులు వచ్చి అడ్డగించడం ఏమిటని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.