హైదరాబాద్, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అమెరికాకు చెందిన ఎన్జీవో ల్యాటర్ డే సెయింట్స్ (ఎల్డీఎస్) ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. సంస్థ ప్రతినిధులు లూక్ డార్స్, జాన్సన్, జాన్ గుట్టి, ఆసియా సభ్యులు జితేందర్, శంకర్‌లూక్ తదితరులు కొన్ని రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇటీవల ధర్మపురి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. సోమవారం హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు తదితర రంగాలకు సంబంధించి అమలవుతున్న ప్రభుత్వ పథకాలను సంస్థ ప్రతినిధులు కొనియాడారు. తమవంతుగా ఆయా రంగాలకు సహాయం అందజేస్తామని మంత్రికి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ నెల 18 నుంచి మార్చి 3వ తేదీ వరకు అమెరికాలో నిర్వహించనున్న రూట్స్ టెక్ ఎక్స్పో-2023లో తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరుకావాలని మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం ఎల్డీఎస్ సభ్యులకు మంత్రి జ్ఞాపికలు అందజేసి శాలువలతో సతరించారు.