అమీన్పూర్, ఫిబ్రవరి 7 : అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్, చక్రపురి కాలనీలను శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ఆయా అసోసియేషన్ సభ్యులతో సమావేశమై సమస్యలపై చర్చించారు. కొద్ది రోజుల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ప్లాట్ల వద్దకు వచ్చి బాధితులతో కమిషనర్ సమావేశం అయ్యారు. వారి ప్లాట్ల ఫిజికల్ పొజిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..
1986లో 400 ప్లాట్లను చక్రపురి కాలనీ వెంచర్లో హుడా ఫైనల్ లేఅవుట్ వచ్చిన అనంతరం కొనుగోలు చేశామని చెప్పారు. చాలాకాలం తర్వాత పక్కనే ఉన్న సర్వే నంబర్ 153లో విజయ్కృష్ణరాజు అనే వ్యక్తి 53 ఎకరాలు కొనుగోలు చేసి ప్లాటింగ్ చేశారు. సదరు వ్యక్తి అధికారులు, నాయకుల అండదండలతో కుమ్మక్కై 400 ప్లాట్ల కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైడ్రా అధ్వర్యంలో సర్వే చేపట్టి పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. అంతకుముందు ఐలాపూర్‌లో బాధితులతో మాట్లాడుతుండగా ఐలాపూర్ వాసి, సుప్రీం కోర్టు న్యాయవాది ముఖీం కల్పించుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఓవరాక్షన్ చేయద్దంటూ కమిషనర్ హెచ్చరించారు.