హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై కొరడా ఝళిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఫీజులను నియంత్రించేందుకు పటిష్టమైన చట్టాన్ని తీసుకురాబోతున్నది. స్కూ ళ్లే కాదు.. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కోర్సుల్లోనూ నిర్ది ష్ట ఫీజుల విధానాన్ని ఖరారు చేయనున్నది. ఇందుకుప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఈ నెల 21న హైదరాబాద్‌లో భేటీ కానున్నది. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ సమావేశం జరగనున్నది. పటిష్టమైన ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని గత జనవరిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు సబితాఇంద్రారెడ్డి, కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ సహా మరికొంత మంది మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ తొలి సమావేశం సోమవారం జరగనుండగా, అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఫీజులను ఖరారు చేయడంతో పాటు, ఫీజులను నియంత్రించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ఈ భేటీ నేపథ్యంలో శుక్రవారం విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనతో విధివిధానాలపై చర్చించారు.
ఇప్పటిదాకా వృత్తి విద్యాకోర్సులకే..
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యాకోర్సులకే నిర్దిష్ట ఫీజు విధానం ఉన్నది. దీనికోసం తెలంగాణ ఫీజ్ అండ్ అడ్మిషన్స్ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఏర్పాటైంది. ఈ కమిటీయే మూడేండ్లకోసారి ఫీజులను ఖరారు చేస్తుంది. అయితే, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజులను నియంత్రించాలని తల్లిదండ్రులు చాలా కాలంగా కోరుతున్నారు. ఇందుకు ప్రభుత్వం గతంలోనే ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసింది. పలు సూచనలు చేసిన ఈ ఏకసభ్య కమిటీ ఫీజులను నియంత్రించేందుకు పటిష్టమైన చట్టాన్ని రూపొందించాలని ప్రతిపాదించింది. దీంతో చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే విద్యాసంవత్సరంలోగా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతున్నది. చట్టం రూపకల్పనకు ఇతర రాష్ర్టాల్లో అనుసరిస్తున్న విధానాలను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ అధ్యయన వివరాలను క్యాబినెట్ సబ్ సమిటీ సమావేశం ముందు ఉంచనున్నారు.
పలు రాష్ర్టాల్లో ఇలా..
రాజస్థాన్‌లో ఫీజులను ఖరారుచేసేందుకు మూడు కమిటీలు ఏర్పాటు చేశారు. పాఠశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోని కమిటీలు ఫీజులను ఖరారు చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు మూడేండ్లకుగాను ఒకసారి ఫీజులను ఖరారుచేసి, అమలుపరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలకు వేర్వేరు ఫీజు విధానాన్ని అమలుచేస్తున్నారు.
గుజరాత్లో 2017-18 సంవత్సరం నుంచి నిర్దిష్ట ఫీజు విధానాన్ని అమలుచేస్తున్నారు. రాష్ర్టాన్ని నాలుగు జోన్లుగా విభజించి స్కూళ్లవారీగా ఫీజులను ఆన్లైన్లో పొందుపరిచారు.