హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతలు ( Law and Order ) కరువయ్యాయని బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు ధ్వజమెత్తారు. ఎక్కడ చూసినా ఏదో మూల ప్రతిరోజు నేరాలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాంతిభద్రతలను గాలికొదిలేశారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమతో కలిసి మాట్లాడారు.
ఒక్క ఇంట్లోనే ఆరుగురు మహిళలు హత్యకు గురయిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో దాపురిం చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వారు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో డ్రగ్స్, గంజాయి, మద్యం వల్ల యువత బలైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చదువు చెప్పే టీచర్‌కు విద్యార్థుల నుంచి రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
కరీంనగర్ లో పట్ట పగలు జ్యువెల్లరీ షాప్ లో దొంగతనం, కేంద్ర మంత్రి కుమారుడు యువతిపై అసభ్యప్రవర్తన, విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు తదితర ఘటనలు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పించారని గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి వ్యాపారాలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని వెల్లడించారు. డ్రగ్స్ అరికట్టడంలో ఈగల్ ఫోర్స్ పని చేస్తుందా ? ఈగలు కొడుతుందా అనే అనుమానం వస్తోందని విమర్శించారు. కొండమల్లెపల్లిలో ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య వెనుక డ్రగ్స్ మాఫీయా హస్తంపై విచారణ చేయాలని, ఈ హత్య వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.