శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 02:12:00

ఈ-ఆఫీస్‌ ప్రారంభం

ఈ-ఆఫీస్‌ ప్రారంభం

  • తొలివిడత 6 ప్రభుత్వశాఖల్లో అమలు
  • అధికారులకు సీఎస్‌  అభినందన
  • కంప్యూటర్‌ యుగంలోనూ పట్టించుకోని ఉమ్మడి పాలకులు
  • ఫైళ్లన్నింటినీ కంప్యూటరీకరించిన  తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వశాఖలు ఈ-ఆఫీస్‌ విధానం అమలువైపు దృష్టిసారిస్తున్నాయి. తొలివిడతలో సాధారణ పరిపాలనశాఖ, అబ్కారీ, మద్యనిషేధశాఖ, వాణిజ్యపన్నులు, ప్రధాన కమిషనర్‌, భూపరిపాలనశాఖలు ఈ-ఆఫీస్‌ విధానం అమలుకు శనివారం శ్రీకారంచుట్టాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కొత్త విధానం ద్వారా ప్రస్తుతం 1,600 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ప్రతి దరఖాస్తు, పరిష్కారానికి జవాబుదారీతనం ఏర్పడుతుందని చెప్పారు. జాప్యానికి తావులేకుండా పౌరులకు సత్వర, మెరుగైన సేవలు అందుతాయని వివరించారు. స్వల్పకాలంలోనే ఈ-ఆఫీస్‌ సేవలకు శ్రీకారం చుట్టిన అధికారులను అభినందించారు. మిగతా శాఖలు కూడా త్వరగా ఈ ఆఫీసు సేవలు ప్రారంభిం చాలని సూచించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, ఎస్సీ డెవలప్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌ నీతూకుమారిప్రసాద్‌, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌అహ్మద్‌, ఫైనాన్స్‌ సెక్రటరీ రొనాల్డ్‌రాస్‌, మహిళా,శిశుసంక్షేమశాఖ కార్యదర్శి దివ్య, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ రజత్‌కుమార్‌ పాల్గొన్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కంప్యూటర్‌ యుగంలోనూ పాలనలో ఈ-ఆఫీస్‌ విధానాన్ని తీసుకురావడానికి 25 ఏండ్లు పట్టింది. ఉమ్మడి పాలకులు పట్టించుకోని ఈ పాలనా విధానం స్వరాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. మొదటగా 2015లో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పైలట్‌ ప్రాజెక్టుగా దీనిని మొదలుపెట్టగా.. తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ చేపట్టి అమలుచేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు స్కోచ్‌ (SKOCH) అవార్డు కూడా వచ్చింది. పైలట్‌ ప్రాజెక్టు ఫలితాలు అనుకూలంగా రావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలుచేయాలని నిర్ణయించారు. శనివారం నుంచి మొదటి విడుతగా జీఏడీ, ఆబ్కారీ, కమర్షియల్‌ టాక్స్‌, సీసీఎల్‌ఏతోపాటు మరో రెండు శాఖలలో ఈ - ఆఫీస్‌ విధానాన్ని ప్రారంభించారు. క్రమంగా అన్ని శాఖలకు విస్తరించేందుకు చకచకా చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులెవరూ ఫైళ్లు పట్టుకొని తిరిగే పనిలేకుండా.. ఈ-ఆఫీస్‌ ద్వారా అవకాశం వచ్చింది. దీనిద్వారా సమయం వృథా కాకపోవడంతోపాటు.. పాలనలోనూ పారదర్శకత పెరుగుతుంది. ఫైల్‌ ఎక్కడా ఓవర్‌లుక్‌ కాకుండా ఉంటుంది. 

ఉమ్మడిపాలనలో చేసిందేమీలేదు

ఐటీని తామే తెచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీమాంధ్ర పాలకులు కనీసం ఫైళ్లను కూడా కంప్యూటరీకరించలేదు. ఆఫీసుల్లో కంప్యూటర్లు పెట్టినా.. కాగితాల వినియోగం మాత్రం తగ్గలేదు. కంప్యూటర్‌లో వాళ్లు చేసిందేమైనా ఉన్నదంటే.. తెలంగాణ భూములకు సంబంధించిన పాత రికార్డుల్లేకుండా చేయడమే. మండలాఫీసుల నుంచి సచివాలయం వరకు ఫైళ్లు షార్ట్‌సర్క్యూట్‌లో తగులబడ్డాయి కానీ, ఇంటర్నెట్‌లో సురక్షితంచేసే ప్రయత్నం చేయలేదు. ఉమ్మడి పాలకులు కావాలనే ఈ-పాలనను తీసుకురాలేదన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఫైళ్లను కంప్యూటరిస్తే తెలంగాణకు వారుచేస్తున్న ఆన్యాయం ఎక్కడ బయటపడుతుందోననే ఇలా చేశారని చెప్తున్నారు. భూములకు సంబంధించిన పాత రికార్డులు చాలావరకు మాయమయ్యాయి. భూదాన్‌భూముల లెక్కాపత్రం లేకుండాచేశారు. చంద్రబాబు హయాంలో మాత్రం అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్‌ అయిన డాక్యుమెంట్లను స్కాన్‌చేసే విధంగా కంప్యూటర్‌ ఎయిడెడ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ డాక్యుమెంట్‌(కార్డ్‌)ను మాత్రమే ప్రవేశపెట్టారు. తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఈ- ఆఫీస్‌ పాలనపై నిర్ణయించినా.. సమావేశాల్లో చర్చకు మాత్రమే పరిమితమైంది.

తెలంగాణలో పారదర్శకత పాలన

పరిపాలనలో పారదర్శకత- ప్రజలకు జవాబుదారీగా ఉండాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో నూతనమార్పులకు శ్రీకారం చుట్టింది. కాగితాలతో పని లేకుండా, ఆలస్యం, అలసత్వానికి తావులేకుండా ఈ- ఆఫీస్‌ను తీసుకువచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచే సమస్తసమాచారాన్ని కంప్యూటరీకరించే కార్యక్రమం చేపట్టింది. ఇందులోభాగంగానే భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళనచేసి కంప్యూటరీకరించింది. ఇంటర్నెట్‌లో భూములకు చెందిన సమస్త వివరాలు అందులో ఉన్నాయి. ఏ భూమి ఎవరికి ఏ విధంగా సంక్రమించిదనే వివరాలను కూడా పొందుపరిచింది. ఇప్పుడు నోట్‌ఫైల్‌ కూడా ఈ- ఆఫీస్‌ ద్వారా చేయడానికి శ్రీకారం చుట్టింది.logo