నందికొండ/ధరూరు/ అయిజ/శ్రీశైలం, ఆగస్టు 8 : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 26 క్రస్ట్ గేట్ల ద్వారా స్పీల్వే మీదుగా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గాను గురువారం 585.90 (300 టీఎంసీలు) అడుగులకు చేరడంతో క్రస్ట్ గేట్లను 18 నుంచి క్రమంగా పెంచుకుంటూ 26 క్రస్ట్ గేట్ల ద్వారా (4 గేట్లు 10 అడుగులు, 22 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి) 2,25,462 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 3,52,158 క్యూసెక్కులు వస్తుండగా.. 2,72,019 క్యూసెక్కుల అవుట్‌ఫ్లోను మెయింటెన్స్ చేస్తున్నారు. సాగర్ క్రస్ట్ గేట్లు మొత్తం ఎత్తడంతో చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జూరాల ప్రాజెక్టుకు గురువారం ఇన్‌ఫ్లో 3.15 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా 42 గేట్లు ఎత్తారు. ప్రాజెక్టు గేట్లు, విద్యుదుత్పత్తి, కాల్వల నుంచి 3,35,488 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. శ్రీశైలం డ్యాంకు ఇన్‌ఫ్లో 3,54,761, అవుట్‌ఫ్లో 3,73,890 క్యూసెక్కులుగా నమోదైంది. పదిగేట్లు, విద్యుదుత్పత్తి నుంచి వరద దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు పరుగులు పెడుతున్నది.
మహదేవపూర్/కాళేశ్వరం/కన్నాయిగూడెం, ఆగస్టు 8 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని మేడిగడ్డ బరాజ్‌కు వరద తగ్గుతున్నది. గురువారం 3,30,830 క్యూసెక్కుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బరాజ్‌కు మానేరు, కాల్వల ద్వారా 4,500 క్యూసెక్కుల నీరు వస్తుండగా, మొత్తం 66 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతున్నది.