HBIC | హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రహదారులకు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌ను (HBIC) ప్రకటించినప్పటికీ దీనివల్ల ప్రయోజనం ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ. ఈ కారిడార్‌లో పావువంతు మాత్రమే తెలంగాణ నుంచి వెళ్తుండగా, మిగిలిన ముప్పావు భాగం ఏపీ, కర్ణాటకలో ఉంటుంది. హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-వరంగల్ కారిడార్లను మంజూరుచేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్-నాగ్‌పూర్ కారిడార్‌ను గతంలో మంజూరు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తాజా బడ్జెట్లో హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌ను మంజూరు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఏపీలోని ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకటించడం గమనార్హం. దీనినిబట్టి ఈ కారిడార్‌ను తెలంగాణ ప్రయోజనాల కోసమా? లేక ఏపీలో పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మంజూరు చేశారా? అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ రహదారికి సమీపంలోనే ఏపీలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి హైదరాబాద్ నుంచి కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి మీదుగా చెన్నైని కలుపుతున్నది. ఇందులో భాగంగానే ప్రస్తుతం హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌ను మంజూరు చేశారని, ఇది కర్నూలు ప్రాంతంలో ఓర్వకల్లును కలుపుతూ బెంగళూరుకు వెళ్తుందని అధికారులు తెలిపారు.
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు మంజూరుచేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ రెండు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్తు, రోడ్లు, హైవేలకు నిధులు కేటాయించారు. గత పదేండ్లలో తెలంగాణలో పారిశ్రామికరంగం గణనీయంగా అభివృద్ధి చెందడం, హైదరాబాద్ చుట్టూ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకావడంతో హైదరాబాద్‌ను అనుసంధానం చేస్తూ ఈ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానిఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)ల అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్-నాగ్‌పూర్ కారిడార్‌ను చేపట్టాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కేంద్రం సూత్రప్రాయంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. ఈ కారిడార్‌ను అభివృద్ధి చేస్తే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడంతోపాటు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర ఉత్తర తెలంగాణ జిల్లాలకు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడి ఎంతో మేలు చేకూరుతుంది.