బెల్లంపల్లి, మార్చి 6 : శాంతిఖని భూగర్భ గనిని లాంగ్వాల్ ప్రాజెక్ట్‌గా మార్చడం వద్దే వద్దని.. పంట పొలాలే ముద్దు అని.. ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని, బలవంతంగా మార్చాలని చూస్తే పదివేల మందితో నిరాహార దీక్ష చేపడుతామని ప్రభావిత గ్రామాల రైతులు హెచ్చరించారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని శాంతిఖని లాంగ్వాల్ ప్రాజెక్ట్ కోసం పాత శాంతిఖని గని ఆవరణలో భారీ పోలీసుల బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. మంచిర్యాల అదనపు కలెక్టర్ సభాపతి మోతీలాల్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మం డలి నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయ అధికారి విష్ణుప్రసాద్ హాజరైన సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్ రైతులకు మద్దుతుగా నాయకత్వం వహించారు. లాంగ్వాల్ ప్రాజెక్ట్‌తో భూములు నాశనమవుతాయని, భూగర్భ జ లాలు అడుగంటుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలతో నడుస్తున్న గనిని లాంగ్వాల్ చేయడమేమిటని ప్రశ్నించారు.
మందమర్రి జీఎం దేవేందర్ ఓసారి ఓసీ, మరోసారి లాంగ్వాల్ ప్రాజెక్టులని.. పూటకో మాట మారుస్తూ రైతులను భయపెడుతున్నారని ఆరోపించారు. 3 నెలల నుంచి ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రశాంతత కరువైందని పేర్కొన్నారు. శాంతిఖనిని ఓసీ చేయడానికే చాపకింద నీరులా లాంగ్వాల్ ప్రాజెక్ట్‌ను ముం దుకు తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్‌తో ఎండిన చెరువులు, బోర్లు, బీడు భూములు దర్శనిమిస్తాయని తెలిపారు. ప్రభావిత గ్రామమైన లింగాపూర్‌లో 400 నుంచి 500 మీటర్లు బోర్ వేస్తేగానీ నీరు రావడం లేదని గుర్తుచేశారు. పంటలు నాశనం అవతాయని చెబుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బొగ్గుతోపాటు వరి కూడా జాతీయ సంపద అని స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఐదు కిలోమీటర్ల పరిధిలో బొగ్గు ఉత్పత్తి చేయకుండా వ్యవసాయ భూములను వదిలి అటవీ భూముల్లో బొగ్గు వెలికితీయాలని సూచించారు. ప్రాణాలు పోయినా లాంగ్వాల్ ప్రాజెక్ట్‌ను అనుమతించమని స్పష్టంచేశారు.
కంటతడిపెట్టిన రైతులు
పచ్చని పొలాల్లో విధ్వంసం సృష్టిస్తారా అని ముడిమడుగుల మల్లన్నతో పాటు మరికొంత మంది రైతులు కంట తడి పెట్టారు. శాంతిఖని గని చరిత్రలో ఎప్పుడూ లేని అనుమతులు కొత్తగా ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. పంట తల్లిని నమ్ముకుని ఉన్న తమను నిరాశ్రయులను చేయవద్దని కోరారు. మూడేళ్ల నుంచి శాంతిఖని షాఫ్ట్‌లో రూపాయి లాభం లేకుండా ఎందుకు బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారని, భారీ యంత్రాలను తీసుకువచ్చి ఇక్కడ ఉత్పత్తి చేయడమెందుకు అని ప్రశ్నించారు.
ఉద్యమిస్తాం..
శాంతిఖని ఓసీ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ప్రకటనతో ప్రభావిత గ్రామాలు ఆకెనపల్లి, లింగాపూర్, పెరకపల్లి, బట్వాన్పల్లి, గురిజాల, పాత బెల్లంపల్లిలో మూడు నెలలుగా ప్రశాంతత కరువైంది. లాంగ్వాల్ ప్రాజెక్ట్ చేస్తామని మందమర్రి జీఎం దేవేందర్ ప్రకటించినప్పటి నుంచి ఇక్కడి రైతులు అభద్రతలో ఉన్నారు. లాంగ్వాల్తో ప్రజల మనుగడ నాశనం అవుతుంది. పోలీసులను ఉపయోగించి, కార్మికులను అడ్డం పెట్టుకుని ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. పచ్చని గ్రామాలను బొందల గడ్డగా మారిస్తే ఉద్యమిస్తాం.
– కారుకూరి రాంచందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
రైతులను బిచ్చగాళ్లను చేయడానికే..
ప్రభావిత గ్రామాల రైతులను బిచ్చగాళ్లను చేయడానికే ప్రాజెక్ట్ చేపడుతున్నారు. మాదారం గోలేటి ప్రాంతాల్లో ప్రాజెక్ట్ చేపట్టాలి. సింగరేణికే జీవించే హక్కు ఉందా…రైతులకు లేదా.. యాజమాన్యం కళ్లు గప్పి మోసం చేస్తోంది. మరో ఉద్యమం చేసి లాంగ్వాల్ ప్రాజెక్ట్‌ను అడ్డుకుంటాం
-చదువుల వెంకటరమణ, రైతు
భూముల రేట్లు తగ్గాయి
లాంగ్వాల్ ప్రాజెక్ట్ ప్రకటనతో ఇక్కడి వ్యవసాయ భూముల రేట్లు తగ్గాయి. ఓసీ, లాంగ్వాల్ చేస్తే తిరుగుబాటు తప్పదు. సింగరేణి యాజమాన్యం మూల్యం చెల్లించుకోకతప్పదు. లాంగ్వాల్ ప్రాజెక్ట్ అంటే భూభాగం మొత్తం రంధ్రాలు అయి ముల్లె మూట సర్దుకుని పోవాల్సిందే.
– కారుకూరి వెంకటేశ్, రైతు