భూత్పూర్, ఆగస్టు 5: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం తాటికొండ గ్రామ శివారులోని భైరవగుట్టపై దాదాపు 4 వేల ఏండ్లకు పూర్వం మానవుడు తయారు చేసిన కొత్తరాతి యుగపు ఆనవాళ్లను గుర్తించినట్టు పురావస్తు శాఖ పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. భూత్పూర్ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యుడు అశోక్‌గౌడ్ విజ్ఞప్తి మేరకు గుట్టపైకి వెళ్లి పరిశీలించగా ఆ కాలంలో మానవుడు తన అవసరాల కోసం ఆయుధాల తయారీని గుర్తించినట్టు వివరించారు. ఆది మానవుడు నివాసం ఉన్న సమయంలో గొడ్డండ్లను సానబెట్టే విధానం.. 7 నుంచి 15 అంగుళాల పొడవు, రెండు-నాలుగు అంగుళాల వెడల్పు, ఒక్క అంగుళం లోతు గాళ్లు ఇప్పటికీ ఆనవాళ్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన వెంట సత్తూర్ అశోక్‌గౌడ్, బంగారు బాలకృష్ణ ఉన్నారు.