న్యాల్కల్, ఆగస్టు 12: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడుతామని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఈదులపల్లి శివకుమార్ భరోసా ఇచ్చారు. నిమ్జ్‌లో భాగంగా వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమానికి వారు మద్దతు తెలిపి సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే న్యాల్కల్ మండలాన్ని నిమ్జ్ పారిశ్రామిక ప్రాంతం పేరుతో నాశనం చేశారని ధ్వజమెత్తారు. మళ్లీ కొత్తగా 2,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములను గుంజుకుంటామంటే చూస్తూ ఉరుకోబోమని స్పష్టం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా భూసర్వే చేపట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులకు అండగా ఉండి వారి పక్షాన ఫార్మాసిటీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు.
అనంతరం ఫార్మాసిటీలో కోల్పోతున్న రైతుల భూములను పరిశీలించారు. ఫార్మాసిటీని ఏర్పాటు చేయవద్దని కోరుతూ జహీరాబాద్ ఆర్డీవో రాజుకు రైతులతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జహీరాబాద్, న్యాల్కల్ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు నారాయణ, రవీంద ర్, నాయకులు రవికుమార్, సుభాశ్గుప్తా, నర్సింహారె డ్డి, విజయ్‌కుమార్, గుండప్ప, సంగ్రాంపటేల్, శ్రీకాంత్‌రెడ్డి, మారుతీయాదవ్ తదితరులు పాల్గొన్నారు.